- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని స్థానాలపై జనసేన దృష్టి
దిశ, తిరుపతి: టీడీపీతో పొత్తు విషయంపై పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టిన నాటి నుంచి రెండు పార్టీల ప్రధాన నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎలా అనే ప్రశ్న వారిని తొలిచేస్తోంది. జనసేన ఇప్పటికే కొన్ని సీట్లపై దృష్టి కేంద్రీకరించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెండు మూడు సీట్లు ఆశించే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇప్పటికే బలంగా ఉంది. ఇటీవల కాలంలో టీడీపీలో చేరిన వారు జనసేన వైపు నుంచి సీటు ఆశించే అవకాశం లేకపోలేదు.
ఆ సీట్లపై జనసేన కన్ను..
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న మదనపల్లి, చిత్తూరు, తిరుపతి సీట్లను టీడీపీతో పొత్తు ఉంటే అడగాలని జనసేన నేతలు ఎప్పటినుంచో అనుకుటుంటున్నారు. తిరుపతి పార్లమెంట్ కూడా ఇవ్వాలని పట్టుపట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడవడం, ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు రావడంతో మదనపల్లి ఇన్‌ఛార్జి రాందాస్ చౌదరిని, చిత్తూరులో ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాసును బరిలోకి దింపాలనే యోచన ఉంది. తిరుపతిలో పవన్ కల్యాణ్ పోటీ చేయని పక్షంలో అక్కడి నుంచి బరిలోకి దిగాలని పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్ ఉవ్విళ్లూరుతున్నారు.
అక్కడైతే గెలుపు ఈజీ..
తిరుపతి, చిత్తూరులలో బలిజ సామాజికవర్గం ఉండడంతో గెలుపు సునాయాసం అవుతుందని పవన్ కల్యాణ్ ఆలోచన. ఆయన అన్న చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేయగా సొంతూరులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ మొదటి ప్రాధాన్యతగా తిరుపతినే ఆశించే అవకాశం ఉంది.
పార్లమెంటు సీటుకు పోటాపోటీ..
తిరుపతి పార్లమెంట్ స్థానానికి పలువురు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, పరసా రత్నం, మాజీ ఎంఎల్‌ఎ నెలవల సుబ్రమణ్యం ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన కూడా ఈ స్థానంపై కన్నేసి ఉంది. దీంతో, ఈ ముగ్గురు సీనియర్ల భవిష్యత్ ఏంటని చర్చ నడుస్తోంది. ఇప్పటికే మదనపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ దొమ్మాలపాటి రమేష్, కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎంఎల్‌ఎ బాషా కూడా టీడీపీలోకి వచ్చారు. అక్కడ వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తిరుపతిలో మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ తనకే సీటు వస్తుందని ధీమాతో ఉన్నారు.
నేతల మధ్య చీలిక తప్పదా..?
టీడీపీ నేత వూకా విజయకుమార్, ఇటీవలే తెలుగుదేశం కండువా ధరించిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ సీటు కోసమే పార్టీలోకి వచ్చారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగితే టీడీపీలోనూ నేతల మధ్య చీలిక వచ్చే అవకాశం లేకపోలేదు. బీజేపీ కూడా తమతో కలిసొస్తుందని పవన్ చెబుతున్నారు. పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని జనసేన అడుగుతుంది. బీజేపీ సైతం సత్యవేడు నియోజకవర్గం తమకు కేటాయించాలని అడుగుతోంది. జనసేన, టీడీపీ పొత్తు క్యాడర్‌ను ఉత్సాహపరచినప్పటికీ, నాయకత్వంలో మాత్రం అంతర్మథనం మొదలైంది. టీడీపీ క్యాడర్లో స్తబ్దత నెలకొంది. మొత్తమ్మీద, వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకూ సవాలుగా మారనున్నాయి.