అమిత్ షా బిగ్ స్కెచ్.. ఆ నలుగురు జంప్?

by srinivas |
అమిత్ షా బిగ్ స్కెచ్.. ఆ నలుగురు జంప్?
X

కేంద్రంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు కీలకమయ్యారు. ఎన్డీయే కూటమికి రాజ్యసభలో తగినంత బలం లేదు. వైసీపీ సహకరిస్తే తప్ప పార్లమెంటులో చేసిన బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందవు. ఇదే విషయం సీఎం చంద్రబాబు, అమిత్​ షా బేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు కూటమి వైపు రావడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ బేషరతుగా మద్దతునిస్తుందా.. ఇవ్వదా అనే దానిపై బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మద్దతునివ్వకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో ఎన్డీయే సర్కారు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గినా వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టింది. రాజ్యసభలో మాత్రం కూటమికి తగినంత బలం లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, పదవీ విరమణల కారణంగా ప్రస్తుతం 225 మంది ఉన్నారు. సభలో మెజారిటీ సాధించాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ సభలో బీజేపీ ప్రస్తుత బలం 86 కాగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 101 మంది ఉన్నారు. ఇండియా కూటమి సభ్యుల సంఖ్య 87. ఇండియా కూటమికి ఇవతల ఉన్న పార్టీల్లో 11 మంది సభ్యులతో వైసీపీ అతి పెద్ద పార్టీగా ఉంది. బీజేడీకి 9, బీఆర్​ఎస్​కు 4, ఏఐఏడీఎంకే పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. వీళ్లు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎన్డీయే సర్కారు తీసుకొచ్చే బిల్లులు ఆమోదం పొందడం కష్టం. అందుకే వైసీపీ నుంచి కొందర్ని తీసుకోవాలనే అంశం సీఎం చంద్రబాబు, అమిత్​ షా మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ నలుగురిపై ఊహాగానాలు..

గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన బీదా మస్తాన్​రావు, ఆర్​ కృష్ణయ్యతోపాటు పిల్లి సుభాష్​ చంద్రబోస్​ గాక మరో ఎంపీ కూటమి వైపు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు సభ్యులు పార్టీ మారితే ఇంకా కొందరు బయటకు రావొచ్చని ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ పెద్దలు మద్దతు అడగాలేగానీ జగన్​ కాదనే పరిస్థితుల్లేవు. ఇటీవల స్పీకర్​ ఎన్నిక సమయంలోనూ వైసీపీ ఎంపీలు బేషరతుగా ఎన్డీయేకు మద్దతునిచ్చారు. అందువల్ల పార్లమెంటులో ప్రవేశపెట్టే కీలక బిల్లుల విషయంలోనూ జగన్​ పూర్తిగా సహకరించే అవకాశమున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

వైసీపీ మద్దతు ఎన్డీఏకే..

రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ కేంద్రంలో తమ ప్రాముఖ్యతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రాజ్యసభలో ఎన్డీయే సర్కారుకు సంపూర్ణ మద్దతునివ్వొచ్చని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ సభ్యులకోసం యత్నించడం ఎందుకనే భావనలో బీజేపీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్​ ఏవైనా షరతులు పెట్టినా.. అంశాల వారీ మద్దతు అనే నిర్ణయానికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చనే ధోరణిలో కమలనాథులున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



Next Story