Chalasani Srinivas: ఆంధ్రా ద్రోహులు వాళ్లే

by srinivas |   ( Updated:2023-04-07 13:20:23.0  )
Chalasani Srinivas: ఆంధ్రా ద్రోహులు వాళ్లే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందని, ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను పోలవరం నిర్వాసితులతో తాము కలిసినట్లు వివరించారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు. పునరావాస కాలనీలు కూడా మునిగిపోయాయంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. శుక్రవారం రాజమండ్రిలో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రం ఒత్తిడి పెంచడం దుర్మార్గమన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న బ్లాక్ మెయిల్ విధానంపై సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు స్పందించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం మాట్లాడకుండా నిద్రపోతోందని చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి శాలువాలు కప్పి వస్తున్నారే తప్ప ఏపీకీ న్యాయం చేసే అంశంలో పోరాటం చేయడం లేదని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. అక్రమాస్తుల కేసుల భయంతో సీఎం జగన్ కేంద్రానికి భయపడుతున్నారని అందుకు విభజన హామీలపై ఒత్తిడి పెంచలేకపోతున్నారని చలసాని శ్రీనివాస్ ఆరోపించారు.

ఉండవల్లి వస్తే కలిసిపోరాడతాం

నవ్యాంధ్రప్రదేశ్ హక్కుల కోసం తాము ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. విభజన హామీలు అమలు కోసం పోరాడటంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని విమర్శించారు. మరోవైపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లు సుమారు 300 మంది వరకు మృతి చెందారని చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎంపీలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్, పోలవరం ప్రాజెక్టులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసి వస్తే పోరాడటానికి తాము సిద్ధమని చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: జగన్ సర్కారుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed