నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

by srinivas |
నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు ఏలూరులో అదృశ్యమైన విషయం తెలిసిందే. జులై 10 నుంచి ఆయన సెలవులపై ఉన్నారు. కొందరు వ్యక్తులు మాధవపాలెం ఫెర్రీ లీజుకు రూ. 55 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండతో డబ్బులు చెల్లించడంలేదని, అందుకే తాను వెళ్లిపోతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెంకటరమణారావు లేఖ రాశారు. బకాయిలు రికవరీ చేయలేక మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం తనను బాధ్యుడ్ని చేసే అవకాశం ఉందంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పి ఆయన తిరిగి ఇప్పటివరకూ ఇంటి వెళ్లలేదు. ఈ నెల 16న తన చివరి పుట్టిన రోజు అని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు. వెంకటరమణారావు ఇంటి నుంచి వెళ్లి 7 రోజులవుతున్నా ఆచూకీ తెలియలేదు. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంకటరమణారావు మిస్సింగ్‌పై విచారణకు ఆదేశించారు. ఫెర్రీ బకాయిల వివరాలు ఇవ్వాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. వెంకటరమణారావు ఎక్కడ ఉన్నది త్వరగా గుర్తించాలని సూచించారు.

Advertisement

Next Story