ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలపై సమీక్ష నిర్వహించండి: కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

by Seetharam |
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలపై సమీక్ష నిర్వహించండి: కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతపై సమీక్ష నిర్వహించాలని కోరారు. వాల్తేర్ రైల్వే డివిజన్‌లోని అలమండ మరియు కంటకాపల్లె మధ్య విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం 14 మంది మృతి చెందిన ఘోర రైలు ప్రమాదంపై ఎంపీ జీవీఎల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో కేవలం ఐదు నెలల వ్యవధిలో రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌‌కు జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణం చెందిన విషయాన్ని లేఖలో ఎంపీ జీవీఎల్ గుర్తు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని ప్రధాన హౌరా-చెన్నై లైన్‌‌లోనే ఆ ప్రమాదం కూడా జరిగిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖలో పేర్కొన్నారు.‘విశాఖపట్నంలో నివసిస్తున్న పార్లమెంటు సభ్యునిగా మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రైళ్ల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

భారతీయ రైల్వేలపై నమ్మకాన్ని నిలబెట్టండి

రైలు భద్రతపై సమీక్ష జరపాలని ఎంపీ జీవీఎల్ లేఖలో కోరారు. ‘ఐదు నెలల స్వల్ప వ్యవధిలో జరిగిన పై రెండు ప్రమాదాల దృష్ట్యా, రైలు భద్రతపై క్రమపద్ధతిలో, విస్తృత సమీక్ష చేయవలసిన అవసరం ఉందని.. తద్వారా రైలు ప్రమాదాలు అరికట్టడమే కాకుండా ప్రయాణీకులకు భద్రతా భావాన్ని కలిగించాలని లేఖలో అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులను మరియు మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకున్నందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు ప్రధాని నరేంద్రమోడీకి ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల భద్రత,భారతీయ రైల్వేలపై జాతీయ నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story