సర్వాత్రా ఉత్కంఠ: ఈనెల 6న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్

by Seetharam |
సర్వాత్రా ఉత్కంఠ: ఈనెల 6న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 6న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల వెల్లడించాయి. ఈ పర్యటనలో వైఎస్ జగన్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు నారా లోకేశ్ పలు కేసులను ఎదుర్కొంటున్నారు. మాజీమంత్రి నారాయణ సైతం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత హస్తినకు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేయడం ప్రభుత్వ కుట్రేనని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు సైతం జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని కూడా విపక్షాలు సూచిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను వైసీపీ మినహా అన్నిపార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఇటీవలే నారా లోకేశ్ కోరారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదనంతరం జరుగుతున్న పరిణామాలపై కేంద్రంతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కిల్ స్కాం కేసులో తమ ఒత్తిడి కానీ.. రాజకీయ కక్ష సాధింపులు లేవనే విషయాన్ని కేంద్రం దగ్గర వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బకాయిలపై విజ్ఞప్తులు

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జలవివాదాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెడికల్ కళాశాలల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా జమిలీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని లా కమిషన్ స్పష్టం చేసినప్పటికీ కేంద్రం యెుక్క వైఖరిపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికలు అయినా ముందస్తు ఎన్నికలకు అయినా వైసీపీ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

రాజకీయ అంశాలపై చర్చ

ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండగానే టీడీపీతో కూడా కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించేశారు. బీజేపీ మాత్రం టీడీపీతో జట్టుకట్టేందుకు ససేమిరా అంటుంది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతోనే ముందుకు అని స్పష్టంగా ప్రకటించేస్తున్నారు. త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీని కూడా వేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఢంకా భజాయిస్తున్నారు పవన్ కల్యాణ్. బీజేపీ, జనసేనలు కలిసి వైసీపీని గద్దె దించాలనుకోవడం అసాధ్యం అని అందుకే టీడీపీతో జట్టుకట్టినట్లు తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో బీజేపీ డైలమాలో పడింది. 2014 మాదిరిగా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనేది బీజేపీ ఎదుట ఉన్న ఏకైక దారి. ఇదే తరుణంలో సీపీఐ సైతం టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. అంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమనే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వామపక్షాలు టీడీపీ-జనసేనకు దగ్గరకాకుండా ముందే బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఉన్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

Advertisement

Next Story