వివేకా హత్యపై అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
వివేకా హత్యపై అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువరు నిందితులు అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే ఏపీ అసెంబ్లీలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు ప్రస్థావన వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ ఎవరో చెప్పాలన్నారు. వివేకాను ఎవరు చంపారో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. వివేకానందారెడ్డి హత్య కేసు నిందితులను శిక్షిస్తామని హెచ్చరించారు. దోషులను వదిలిపెట్టేదిలేదని తెలిపారు. అలాగే వినుకొండలో జరిగిన రషీద్ హత్య కేసుపైనా ఆయన స్పందించారు. హత్యకు గురైన రషీద్, నిందతుడు జిలానీ ఎవరని ప్రశ్నించారు. వాళ్లిద్దరు ఏ పార్టీలో పని చేశారని నిలదీశారు. హత్యలు, నేరాలు, ఘోరాలు, అరాచకాలకు పాల్పడటం, రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేసిన వారిని శిక్షాస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 మంది హత్యకు గురయ్యారని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం, సిగ్గు, నిజాయితీ ఉంటే 36 మంది పేర్లు ఇవ్వాలని సవాల్ చేశారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు చంపిన వారి లిస్టు ఇచ్చామని, గతంలో పట్టించుకోలేదని, ఇప్పుడు వాళ్లపైనా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఆ కేసులన్నీ రీ ఓపెన్ చేస్తామన్నారు. మాయ, నంగి మాటలు, దొంగ ఏడుపులు వద్దని చెప్పారు. తమ పార్టీ నేతలపైనా దాడుల చేశారని, తప్పు చేసిన వాళ్లను కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.



Next Story