రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గువ్వల బాలరాజు అసంతృప్తి

by GSrikanth |
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గువ్వల బాలరాజు అసంతృప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. క్రీడాకారులు, కళాకారులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి తనను పిలవకపోవడాన్ని తప్పుబట్టారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చి, మొగులయ్యకు మాత్రం నగరశివారు ప్రాంతమైన బీఎన్‌రెడ్డి కాలనీలో స్థలం కేటాయించడంపై బాలరాజు సీరియస్ అయ్యారు. మొగిలయ్యను ఢిల్లీకి తీసుకెళ్లి అతని కళను అందరికీ పరిచయం చేసింది తానేనని గువ్వల బాలరాజు గుర్తు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గురువారం బీఆర్కేభవన్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులకు ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారం రోజుల్లో స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ అవుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. అంతేకాకుండా, క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. బాక్సర్ నిక్కత్ జరీన్‌, షూటర్ ఈషాసింగ్‌కు డీఎస్పీ ఉద్యోగం, బంజారాహిల్స్‌లో 600 గజాల స్థలం ఇస్తున్నామని ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు కూడా హైదారాబాద్‌లో 600 గజాల భూమి, డబ్బులు ఇచ్చామని చెప్పారు. మరోవైపు తనకు హైదారాబాద్‌లో 600 గజాల జాగా ఇవ్వడంపై కిన్నెర మొగిలయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ తాత తరాల నుండి కిన్నెర వాయిద్యంను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ఆ కళను కాపాడిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని మొగిలయ్య హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed