- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
U Turn: సీఎం జగన్‌కు షాక్‌లు తప్పవా?
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోని బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో బీజేపీ తమ ప్రత్యర్థి వైసీపీ అని చెప్తూనే కేంద్రంలోని బీజేపీకి అడగకుండానే మద్దతు ఇస్తోంది. అటు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్థి పార్టీ తామేనని బీజేపీ చెప్తున్నా కేంద్రం చెప్పిన ఆదేశాల మేరకు జగన్‌పై విమర్శలు చేయడంలో దోబూచులాడుతుంది. ఇలా వైసీపీ-బీజేపీల మధ్య దోస్తీని ప్రజలు గమనించేశారు. ఒకప్పుడు చీకటి బంధాలను బట్టబయలు చేసేశారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ-వైసీపీ ఒక్కటేనని రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. దీంతో పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో రాష్ట్రనాయకత్వం మేల్కొంది. బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంప మునిగిందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది.
అదే తరుణంలో కేంద్రంలోని పెద్దలు వైసీపీతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల పార్టీకి అవి మంచి చేయకపోగా చేటు తీసుకు వస్తున్నాయని కాబట్టి బీజేపీకి టీడీపీ ఎంత దూరమో..వైసీపీ కూడా అంతేదూరమన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్తామని అందుకు సహకరించాలని కేంద్రపెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో వైసీపీ నేతలు బీజేపీ నేతలపై దాడులకు పాల్పడటం, జనసేన కూడా బీజేపీతో పొత్తుపై పునరాలోచనలో పడటంతో బీజేపీ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీతో చెలిమికి నై చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఎక్కడో చెడింది
వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టగా కాంగ్రెస్ హైకమాండ్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్‌పై అక్రమాస్తుల కేసుల పేరుతో జైలకు సైతం వెళ్లడం జరిగింది. అంతేకాదు జగన్‌కు దగ్గరైన ఎమ్మెల్యేలపై వేటు వేయడం అనంతరం ఎన్నికల్లో దాదాపు 90శాతం మంది ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యారు. పైకి కేంద్రం పెద్దలను అప్పుడప్పుడు కలుస్తున్నప్పటికీ లోలోపల మాత్రం పొత్తుకంటే బలమైన బంధం ఏర్పరచుకున్నారు. అటు కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకైనా వైసీపీ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బీజేపీ పెద్దలు పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ కంటే వైఎస్ జగన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అదే ప్రచారం గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించింది. ఇదే అంశాన్ని కేంద్రంలోని పెద్దల దృష్టికి రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్లినట్లుతెలుస్తోంది. ఈ పరిణామాలతో బీజేపీ నాయకత్వం వైసీపీతో ముఖ్యంగా వైఎస్ జగన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అనుబంధం తెగిపోనుందా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు మధ్య ఉన్న బంధానికి స్వస్తి పలికే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అపాయింట్మెంట్ అడిగితే చాలు వెల్‌కమ్ చెప్పి మరీ అపాయింట్మెంట్‌లు ఇచ్చేవారు కేంద్రంలోని పెద్దలు. ఒకప్పుడు రాజ్యసభలో బలం లేకపోవడంతో వైసీపీ మద్దతు తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం ఉభయ సభలలోనూ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు అవసరం లేదు. ఇదే తరుణంలో బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇది పార్టీకి మరింత చేటు తెస్తుందని అధిష్టానం భావిస్తుంది. ఈ పరిణామాలతో వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాటి అనుబంధానికి బీజేపీ రాం రాం చెప్పేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్‌కు షాక్‌లు తప్పవా అన్నట్లు ప్రరచారం జరుగుతుంది. వైఎస్ జగన్‌కు సహాయ నిరాకరణ బీజేపీ నుంచి ఎదురైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వైఎస్ జగన్‌కు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్రప్రభావం చూపుతుంది. ఈ కేసులో ఆరోపణలన్నీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల వేళ్లు అన్నీ జగన్ ఇంటివైపే చూపిస్తున్నాయి. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం తాడేపల్లి ప్యాలెస్ నుంచేనని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైనా అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టడంతో కేంద్రాన్ని ప్రాధేయపడేందుకు వెళ్లారని ఆరోపించిన దాఖలాలు లేకపోలేదు. అంతేకాదు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు కూడా పేరున్న లాయర్లకు కేసు అప్పగించడం కూడా సంచలనంగా మారింది. సీఎం జగన్ సపోర్ట్ వారందరికీ ఉందనే ప్రచారం లేకపోలేదు. అంతేకాదు ఇటీవలే వైఎస్ వివేకా హత్య కేసు విచారణాధికారి రాంసింగ్ బదిలీలోనూ జగన్ ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇంతలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇటీవలే సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌ను తప్పించిన తర్వాత ఈ హత్యకేసులో నుంచి ఉపశమనం కలిగినట్లేనని భావిస్తున్న తరుణంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో సీబీఐ దూకుడుకు కేంద్రం కళ్లెం వేస్తే భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగేది కాదని కానీ జరిగింది అంటే కేంద్రంతో వైసీపీకి సంబంధాలు తెగిపోయినట్లేనని తెలుస్తోంది.
కేసుల్లో సహాయనిరాకరణ
కోడికత్తి కేసులో ఇప్పటికే ఊహించని పరిణామాలు ఎదుర్కొంది వైసీపీ. కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. అంతేకాదు నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ టీడీపీ సానుభూతిపరుడు కాదని కూడా నిర్ధారించింది. అంతేకాదు ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ ఓనర్‌కు ఈ దాడికి కూడా ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొన్న ఈ అంశాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి తరుణంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ మరింత మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితులను పరిశీలిస్తుంటే వైఎస్ జగన్‌కు కేసుల విషయంలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ కేసులు సంగతి ఇలా ఉంటే మూడు రాజధానుల కేసు విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే టెన్షన్ వైసీపీలో నెలకొంది. అదే తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను కేంద్రం తిరగదోడితే జగన్ పరిస్థితి ఏంటనే దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మింగలేక కక్కలేని పరిస్థితి
ఒకవేళ బీజేపీ వైసీపీకి సహాయ నిరాకరణ చేస్తే భవిష్యత్ కార్యచరణ ఏంటనేదానిపై చర్చ జరుగుతుంది. ఏపీకి నిధులు ఇవ్వకపోయినా..? విభజన హామీలు అమలు చేయకపోయినా.. కేంద్రాన్ని ఎప్పుడు సీఎం జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాగే పార్లమెంట్‌లో ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టినా అడగకుండానే మద్దతు ఇచ్చేవారు. అప్పుడు పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు రివర్స్ అయ్యింది. దీంతో గతంలో చంద్రబాబు మాదిరిగా వైఎస్ జగన్ కేంద్రంపై పోరుకి దిగే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ పోరుకు దిగితే అక్రమాస్తుల కేసులను తిరగదోడుతారు. తిరగదోడితే వైఎస్ జగన్‌కు ముప్పు తప్పవని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గనుక దూరం పెడితే జగన్ పరిస్థితి మింగలేక కక్కలేని పరిస్థితేనని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Breaking: ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం