రాజా విక్రమ్ దేవ్ వర్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.. బీజేపీ ఎంపీ జీవీఎల్

by Javid Pasha |
రాజా విక్రమ్ దేవ్ వర్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.. బీజేపీ ఎంపీ జీవీఎల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూమిని ఇచ్చిన దాత, ఉత్తరాంధ్ర జిల్లాల విద్యా ప్రదాత ఒడిషా జైపూర్ సంస్థానం మహారాజు రాజా విక్రమ్ దేవ్ వర్మ విగ్రహాన్ని ఆర్కే బీచ్ రోడ్డులో ప్రతిష్టించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ డిమాండ్ చేశారు. విశాఖలో ఏయూ నిర్మాణానికి అత్యంత విలువైన భూమిని, కోట్లకొద్దీ డబ్బుని విరాళంగా ఇచ్చిన ఒడిషా జైపూర్ సంస్థానం మహారాజు రాజా విక్రమ్ దేవ్ వర్మ విగ్రహాన్ని అర్కే బీచ్ రోడ్డులో ప్రతిష్టించాలని కోరారు. రాజా విక్రమ్ దేవ్ వర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదులు అని, ఆంధ్రా మరియు ఉత్కళవిశ్వ విద్యాలయాల స్థాపకులు అనీ జీవీఎల్ కొనియాడారు. విద్య మీద ఉన్న మక్కువతో వేరే ప్రాంతాలకు తరలిపోవలసిన ఆంధ్రా విశ్వ విద్యాలయానికి అవసరమైన కోట్లాది రూపాయల విలువైన భూమిని, ఆరోజుల్లోనే లక్షలాది రూపాయల ధనాన్ని వెచ్చించారని, విశాఖకు మాత్రమే కాక ఉత్తరాంధ్ర అభివృద్ధికి విద్యను మాత్రమే సరైన మార్గంగా గుర్తించి విద్యాభివృద్ధికి అవిరళ కృషి చేసిన విద్యాప్రదాత రాజా విక్రమ్ దేవ్ వర్మ అని జీవీఎల్ అన్నారు.

మంగళవారం రాజావారి మనుమని భార్య ప్రస్తుత జైపూర్ సంస్థానం రాజమాత, మహారాణి మయంకా కుమారి దేవ్‌ని ఎంపీ జీవీఎల్ కలిశారు. వారితో సమావేశమైన జీవీఎల్ తరువాత మాట్లాడుతూ.. విశాఖలో దేశంలోనే మొదటిసారిగా ఎంబీయే, న్యూ క్లియర్ ఫిజిక్స్ వంటి ఉన్నత విద్యలకు పునాది వేసిన వ్యక్తి రాజా విక్రమ్ దేవ్ వర్మ అని జీవీఎల్ కొనియాడారు. ఇంకా ఎన్నో విద్యాలయాలకు, దేవాలయాలకు గొప్ప విరాళాలిచ్చి తరాలపాటు గుర్తుంచుకోవాల్సిన రాజా విక్రమ్ దేవ్ వర్మ విగ్రహాన్ని ఆర్కేబీచ్ రోడ్ లో ప్రతిష్టించడానికి అనువైన స్థలాన్ని కేటాయించమని రాజవంశీకులు ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని,ఇకనైనా నిర్లక్ష్యం వీడి వెంటనే రాజావారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అవసరమైన స్థలాన్ని ఆర్కేబీచ్ రోడ్ లో కేటాయించాలని జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా విశాఖకు మేలు చేసిన వారిలో ప్రముఖంగా గుర్తుంచుకోవలసిన రాజావారి ఔనత్యాన్ని తరాలపాటు విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి,విశాఖ వాసులకు గుర్తు చేసినట్లు అవుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు.

Advertisement

Next Story