New Liquor Policy: ఏపీలో న్యూ లిక్కర్ పాలసీ.. నేటి నుంచి దరఖాస్తులు షురూ

by Y.Nagarani |
New Liquor Policy: ఏపీలో న్యూ లిక్కర్ పాలసీ.. నేటి నుంచి దరఖాస్తులు షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీఎస్ బీసీఎల్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఏపీలో నూతన మద్యం విధానానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది ప్రభుత్వం. రెండేళ్ల కాలపరిమితితో ఈ నూతన లిక్కర్ పాలసీని ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేందుకు సోమవారం అర్థరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. దరఖాస్తుదారులు ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది. దరఖాస్తుదారులు డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు చలానాల ద్వారా ఫీజును చెల్లించి.. సంబంధిత రిసిప్ట్ ను ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాల్సి ఉంటుంది.

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 9 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న వాటిని లాటరీ తీసి లైసెన్సులను అందించనున్నారు. అక్టోబర్ 12 నుంచి కొత్త దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతాయి.

కాగా.. మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఉండే జనాభాను బట్టి లైసైన్స్ ఫీజులను నిర్ణయించారు. మొత్తం 4 శ్లాబుల్లో ఫీజులను ఖరారు చేశారు. మొదటి సంవత్సరం 10 వేల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో రూ.50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది 10 శాతం ఫీజును పెంచుతారు. ప్రతి సంవత్సరం ఈ ఫీజును 6 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. మోడల్ స్టోర్స్ గా అప్ గ్రేడ్ చేసుకునేవారు రూ.5 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

3396 దుకాణాల్లో గీత కార్మికులకు ప్రత్యేకంగా 340 దుకాణాలు కేటాయించనుంది ఏపీ సర్కార్. గౌడ, శెట్టి బలిజ కులాల వారికి 336, శ్రీకాకుళంలో సొండి కులానికి 2, విశాఖలో 1, విజయనగరంలో 4 దుకాణాలు కేటాయించారు. వీటికి సంబంధించిన పాలసీ విధానం 2-3 రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed