వారి నుంచి విముక్తి కల్పించిన రోజే అంబేద్కర్ కి అసలు నివాళి.. వైఎస్ షర్మిల

by Ramesh Goud |
వారి నుంచి విముక్తి కల్పించిన రోజే అంబేద్కర్ కి అసలు నివాళి.. వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని, దేశంలో మోదానీ రాజ్యాంగం అమల్లో ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP Congress Chief YS Sharmila) ఆరోపించారు. డా. బీఆర్ అంబేద్కర్ జయంతి (Dr.BR Ambedkar Birth Anniversary) సందర్భంగా ట్విట్టర్ లో నివాళులు అర్పించిన ఆమె.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. భారత రాజ్యాంగ నిర్మాత, రాజనీతి కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం దేశ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి భారతరత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు (Great Tributes) అర్పిస్తున్నానని అన్నారు.

అలాగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాల మేలుకలయిక మన అంబేద్కర్ అని, రాజ్యాంగంలో హక్కులే పునాదులు అని, అన్ని మతాలు, కులాల మధ్య సమానత్వం ఉండాలని, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను, వారి హక్కులను కాపాడాలనేది అంబేద్కర్ ఆశయమని తెలిపారు. ఇక నేడు బీజేపీ (BJP) అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి, ఆర్ఎస్ఎస్ (RSS) భావజాలానికి పెద్ద పీట వేస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి (Manusmruthi) అమలు చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవ్వాళ దేశంలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు.. నరేంద్ర మోడీ (Narendra Modi) దోస్తు అదానీ (Adani)తో కలిసి రాసుకున్న మోదానీ రాజ్యాంగం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లౌకిక వాదాన్ని పక్కన పెట్టి మతం పేరుతో మంటలు రేపుతున్నారని, విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. రక్తపాతం సృష్టించి శవాల మీద రాజకీయం చేస్తున్నారని, నేల,నింగి,నీరు అనే తేడా లేకుండా దేశ సంపద దోచుకుతింటున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ దేశానికి బీజేపీ నుంచి విముక్తి లభించిన నాడే మహనీయుడు అంబేద్కర్ కి నిజమైన నివాళులు అని షర్మిల రాసుకొచ్చారు.



Next Story

Most Viewed