కరోనా.. కుఛ్ కరోనా

దిశ, న్యూస్ బ్యూరో : ప్రతీ ఒక్కరిని భయపెడుతున్న కరోనా.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ విభాగ అధికారులను చూసి భయపడుతోంది. రాష్ట్ర స్థాయి, గ్రేటర్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం కరోనా నివారణ చర్యలు కనిపించడం లేదు. మెట్రో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైరస్ నివారణకు పలు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చికిత్స కంటే నివారణే ముఖ్యమైంది. ప్రజలు సైతం మాస్క్‌ల కోసం ఆరాటపడుతుండటంతో రేట్లు అమాంతం […]

Update: 2020-03-18 08:30 GMT

దిశ, న్యూస్ బ్యూరో : ప్రతీ ఒక్కరిని భయపెడుతున్న కరోనా.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ విభాగ అధికారులను చూసి భయపడుతోంది. రాష్ట్ర స్థాయి, గ్రేటర్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం కరోనా నివారణ చర్యలు కనిపించడం లేదు. మెట్రో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైరస్ నివారణకు పలు చర్యలు చేపడుతున్నారు. కొత్తగా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చికిత్స కంటే నివారణే ముఖ్యమైంది. ప్రజలు సైతం మాస్క్‌ల కోసం ఆరాటపడుతుండటంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్కిల్, జోన్ ఆఫీసులకు నిత్యం వేల మంది వస్తుంటారు. వారిలో కరోనా ఎవరికి ఉందో తెలియదు. అసలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఉద్యోగులు, సిబ్బంది వైరస్ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రధాన అధికారులు, ఐఏఎస్‌లు, రాజకీయ, నగర ప్రముఖులు, వివిధ రంగాల్లో ప్రోత్సాహం కోసం ఔత్సాహికులు, సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కూడా పలు రకాలుగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే బల్దియా ప్రధాన కార్యాలయంలోనే వైరస్ వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలు శూన్యం. కేవలం ఎంట్రన్స్ వద్ద అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. కార్యాలయంలోనే పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు కూడా మాస్క్‌లు అందించే స్థితిలో బల్దియా లేకపోవడం బాధాకరం.. వైరస్ నివారణకు రూ.500 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించినా మన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మాస్క్‌లు కనిపించడం లేదు. మహిళా కార్మికులు కొందరు వారి చీర కొంగులకు మాస్క్‌లుగా కట్టుకుని బల్దియా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

జీహెచ్ఎంసీ మాత్రమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యాలయాలైన హెచ్ఎండీఏ, బీఆర్‌కే భవన్, విద్యుత్ సౌధ తదితర కార్యాలయాల్లోనూ అక్కడి అధికార సిబ్బంది ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకుండానే విధుల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు అనేక ప్రాంతాల నుంచి వివిధ రకాల మనుషులు వస్తుంటారు. వైరస్ ఎవరిలో ఉందో తేల్చడం అంత సులభమేమీ కాదు.. ఏ ఒక్కరి వల్లనో అది ప్రభుత్వ కార్యాలయంలోకి వస్తే జరిగే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమే.. ఓ వైపు సాధారణ జనం వైరస్‌కు భయపడి పలు జాగ్రతలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం, మీడియా కూడా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు, అందరికి సమాచారమిచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి మాత్రం ఏమీ చేయడం లేదు. వారి ప్రాణాలు గాలిలో దీపంలా ఉండిపోవడం బాధాకరం.

మంత్రి మీటింగ్ కోసం మాస్క్‌లు..

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం సాధారణ మాస్క్‌లు అందించారు. బల్దియాలోనే ఉండే సెక్యూరిటీకి అవి కూడా లేవు. అక్కడే పనిచేసే పారిశుధ్య కార్మికులను ఈ విషయంలో పట్టించుకున్నవారే లేరు. బల్దియా పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రోడ్లను ఊడ్చే కార్మికుల వద్ద మాస్క్‌లు, గ్లౌస్‌లు కనిపించడం లేదు. అధికారులు ఇచ్చామని చెబుతారు.. కార్మికులు ఇవ్వలేదని చెబుతున్నారు.. బల్దియా లోగుట్టు వారికే తెలియాలి. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ప్రాణాలను వదిలేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారందరికీ వైరస్ నివారణకు అవసరమైన సాధనాలను అందించడమే గాక ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. కోట్లు ఖర్చు పెట్టి ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసే బదులు రూ.10 కూడా లేని మాస్క్‌లను ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సరఫరా చేయడం ద్వారా కరోనాను అరికట్టవచ్చు. సిబ్బందితో పాటు ప్రజలకు కరోనా వ్యాపించకుండా ముందు జాగ్రతతో మెలగాల్సిన అవసరాన్ని ఇకనైనా గుర్తించాలని కోరుకుందాం.

Tags: Corona, telangana, Ghmc, Hmda, ktr, mask

Tags:    

Similar News