చేతగాని సీఎం అంటూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

దిశ, నల్లగొండ: తెలంగాణ ఉద్యమంలో ముందు వ‌రుస‌లో ఉండి పోరాటం చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాక చనిపోతుంటే సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. న‌ల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఆమె కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నిరుద్యోగులకు తీర‌ని అన్యాయం జరిగిందని, 1200 మంది బ‌లిదానం చేస్తే ఏర్పడిన రాష్ట్రంలో యువ‌కుల‌కు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం […]

Update: 2021-10-12 08:40 GMT

దిశ, నల్లగొండ: తెలంగాణ ఉద్యమంలో ముందు వ‌రుస‌లో ఉండి పోరాటం చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాక చనిపోతుంటే సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. న‌ల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ ట‌వ‌ర్ వ‌ద్ద నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఆమె కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో నిరుద్యోగులకు తీర‌ని అన్యాయం జరిగిందని, 1200 మంది బ‌లిదానం చేస్తే ఏర్పడిన రాష్ట్రంలో యువ‌కుల‌కు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఎక్కడా క‌నిపించని కేసీఆర్, కేటీఆర్, క‌విత‌కు మాత్రమే ఉద్యోగాలు వ‌చ్చేయే త‌ప్ప సామాన్యుల‌కేం ద‌క్కలేదన్నారు.

కండ్ల ముందు రెండు ల‌క్షల ఉద్యోగాలున్నా ఒక్క నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ చేయ‌డం లేదని మండిపడ్డారు. త‌ల్లిదండ్రుల‌కు భారం కాలేక‌, స‌మాజంలో త‌లెత్తుకుని తిర‌గ‌లేక నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నా తెలంగాణ పాలకులు దున్నపోతుపై వాన‌ప‌డిన‌ట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది ఫామ్ హౌజ్‌లో తిని, ప‌డుకునేందుకా అని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో త‌న బిడ్డ క‌విత ఓడిపోతే.. ప‌ద‌వి లేద‌ని ఆందోళ‌న చెంది, ఆగ‌మేఘాల మేద ఎమ్మెల్సీ చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బిడ్డకు ఉన్న విలువ రాష్ట్ర ప్రజ‌ల‌కు లేదన్నారు.

వైఎస్ఆర్ పాల‌న‌లో నిరుద్యోగులు క్షేమం

వైఎస్ఆర్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగుల క్షేమంగా ఉన్నారని, ఏ ఒక్కరూ ఆత్మహ‌త్య చేసుకోలేదన్నారు. ఐదేండ్లలోనే మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చి, ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారని గుర్తు చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేసిన మ‌హ‌నీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11ల‌క్షల ఉద్యోగాలు సృష్టించారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ల ద్వారా పేద‌ల‌కు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి క‌ల్పించారన్నారు. పేద‌వాడికి జ‌బ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల‌పాల‌వుతుంద‌ని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారని, ఫోన్ చేసిన 20 నిమిషాల‌కే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయ‌కుడు వైఎస్ఆర్ అని అన్నారు.

ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45ల‌క్షల ఇండ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ ఐదేండ్లలోనే తెలుగువారికి 46ల‌క్షల ప‌క్కా ఇండ్లు క‌ట్టించి ఇచ్చారని పేర్కొన్నారు. ఐదేండ్లలో ఒక్క చార్జీ కూడా పెంచ‌కుండా సంక్షేమ పాల‌న అందించిన రికార్డు ముఖ్యమంత్రి ఒక్క వైఎస్ఆర్ అని కొనియాడారు. కానీ కేసీఆర్ మాత్రం డిగ్రీలు, పీజీలు చేసిన విద్యావంతులను బర్లు, గొర్లు కాచుకోవాలంటున్నారని, కేసీఆర్ కుటుంబానికి మాత్రం రాజకీయ ఉద్యోగాలు కావాలా అని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లో పని చేయకుండా ఉంటున్నది ఎవరు ? ప్రజలు కష్టపడకపోయి ఉంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? కేసీఆర్ ఏ రోజైనా రోడ్ల మీద, రైలు పట్టాల మీద పడుకున్నారా ? లాఠీ దెబ్బలు తిన్నారా ? అని పశ్నించారు.

వైఎస్ఆర్ హయాంలోనే 80శాతం ప్రాజెక్టులు పూర్తి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 80 శాతం ప్రాజెక్టుల‌ను వైఎస్ఆర్ హయాంలోనే పూర్తిచేశారని, మిగిలిన 20శాతం ప‌నులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయ‌లేక‌పోతోందని విమర్శించారు. పోడు భూముల‌ను ప‌రిష్కరిస్తామ‌ని అన్ని జిల్లాల్లో ప్రసంగించిన కేసీఆర్.. ఆ దిశ‌గా ఒక్క అడుగు కూడా వేయ‌డం లేదన్నారు. కేసీఆర్‌ను కుర్చీ దించితేనే స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతాయని అన్నారు. తాలిబ‌న్లు డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటే.. ఇక్కడి కేసీఆర్ లిక్కర్ ద్వారా బిజినెస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మ‌ద్యం అమ్మకాల వ‌ల్ల మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని, కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు.

ఏండ్లు గడిచినా ప్రమోషన్లు లేవని పోలీసుల లేఖ

వైఎస్ షర్మిల మాట్లాడుతుండగానే సభ మధ్యలో ఓ పోలీసు లేఖ పంపించగా ఆమె చదివి వినిపించారు. పోలీసుల‌కు 30 ఏండ్ల సర్వీస్ గ‌డిచినా ప్రమోష‌న్లు లేవ‌ని, జీతాలు 10వ తేదీ వ‌ర‌కు రావడంలేదని లేఖలో పేర్కొన్నారు. ఎంతో మంది పోలీసులు.. ప్రమోష‌న్లు లేక చ‌నిపోతున్నార‌ని, కేసీఆర్‌కు సిగ్గుండాలి అని విమర్శించారు. ఫాం హౌజ్‌లో ఉండి చేత‌గాని ప‌రిపాల‌న చేయ‌డం కంటే రాజీనామా చేసి, ద‌ళితుడిని ముఖ్యమంత్రిని చేయాల‌ని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News