Wickremesinghe: భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి: శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. ఈ విషయంపై దృష్టి సారించాలని తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. ఈ విషయంపై దృష్టి సారించాలని తెలిపారు. ‘ఏన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్’ అనే థీమ్‌తో జరిగిన 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో విక్రమసింఘే ప్రసంగించారు. ఇండియా, శ్రీలంకల మధ్య ధృడమైన సంబంధాలు ఉండాలని తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతం ఆర్థిక వృద్ధికి కేంద్రంగా ఆవిర్భవిస్తున్నందున, బిమ్స్‌టెక్ ప్రాముఖ్యత పెరుగుతూనే ఉందన్నారు.‘శ్రీలంక భారతదేశంతో సన్నిహిత ఆర్థిక ఏకీకరణను కోరుకుంటోంది. జపాన్ నుండి భారత్ వరకు విస్తరించే ఆర్థిక సహకార ఒప్పందాలను అన్వేషిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల తమ దేశ ఆర్థిక సంక్షోభం సమయంలో మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, భారత ప్రజలకు విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. గత రెండేళ్లుగా ఎదురైన సవాళ్లను అధిగమించి, దివాలా నుంచి బయటపడేందుకు శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. గ్లోబల్ సౌత్‌ను బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించాలని సూచించారు. భారత్‌తో త్వరలోనే సమగ్ర ఆర్థిక, సాంకేతిక ఒప్పందాన్ని శ్రీలంక ఖరారు చేయనుందని తెలిపారు.