Vietnam: నవజాత శిశువుల అక్రమ రవాణా రాకెట్‌ను చేధించిన వియత్నాం పోలీసులు
నవజాత శిశువుల అక్రమ రవాణా రాకెట్‌ను తాజాగా వియత్నాం పోలీసులు చేధించారు
దిశ, నేషనల్ బ్యూరో: నవజాత శిశువుల అక్రమ రవాణా రాకెట్‌ను తాజాగా వియత్నాం పోలీసులు చేధించారు. దేశంలోని అనేక నగరాలు, ప్రావిన్సులలో 16 నవజాత శిశువులను అక్రమంగా రవాణా చేసిన 12 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు అక్కడి మీడియా బుధవారం తెలిపింది. మూడు రోజుల నుంచి మూడు నెలల వయస్సు గల శిశువులను, అక్రమంగా వేరే వారికి విక్రయిస్తున్న పురుషులు, మహిళలు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా సోషల్ మీడియాలోని గ్రూపులను ఏర్పాటు చేసుకుని, పిల్లలను పోషించడానికి కష్టపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి కొంత అమౌంట్ ముట్టజెప్పి ఆ పిల్లలను ఎక్కువ ధరకు ఇతరులకు అమ్ముతున్నారు. పోలీసులు పేర్కొన్న దాని ప్రకారం, బేబీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితులు ఒక్కో బిడ్డను $400 నుంచి $930 మధ్య డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి, నకిలీ దత్తత పత్రాలను సృష్టించి $1,400 నుంచి $3,000 మధ్య తిరిగి వేరే వారికి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 32 నగరాలు, ప్రావిన్సులలో 84 అనుమానిత శిశువుల అక్రమ రవాణా కేసులను పోలీసులు చేధించారు.