ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు.. యూఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మార్కెట్లోకి ఎగిరే కార్లు రాబోతున్నాయి.

Update: 2023-06-30 14:25 GMT

కాలిఫోర్నియా : మార్కెట్లోకి ఎగిరే కార్లు రాబోతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు “అలెఫ్ మోడల్ ఏ”కు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమాన అనుమతి ఇచ్చింది. ప్రపంచంలో ఈ అనుమతి పొందిన తొలి కారు ఇదే. కాలిఫోర్నియాకు చెందిన “అలెఫ్ ఏరోనాటిక్స్” కంపెనీ ఈ ఫ్లైయింగ్ కారును అభివృద్ధి చేసింది. తమ ఎలక్ట్రిక్ ఎగిరే కారుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి ప్రత్యేక ఎయిర్‌ వర్థినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ ప్రకటించింది. రోడ్డుపై నడవడంతో పాటు ఆకాశంలో ఎగరడం అలెఫ్ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత.

దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే రోడ్డుపై 322 కి.మీ.. గాలిలో 177 కి.మీ జర్నీ చేయొచ్చు. ఈ ఫోర్-వీలర్ కారు బాడీని కార్బన్ ఫైబర్‌ మెటీరియల్ తో తయారు చేశారు. దీనికి అట్రాక్టివ్ రెక్కలు కూడా ఉంటాయి. అలెఫ్ ఫ్లయింగ్ కారు బుకింగ్స్ గత ఏడాది (2022) అక్టోబర్‌ నుంచే ప్రారంభమయ్యాయి. ఈ కారును అలెఫ్ వెబ్‌సైట్ ద్వారా కనిష్టంగా రూ.12,308తో ప్రీ ఆర్డర్ చేయొచ్చు. గరిష్టంగా రూ.1.23 లక్షలతో ప్రీ ఆర్డర్ చేసే బుకింగ్స్ ను ఆమోదిస్తున్నారు. కారు ధర సుమారు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫ్లయింగ్ మోడ్ బటన్‌ను నొక్కగానే..

అలెఫ్ మోడల్ A కారులోని ఫ్లయింగ్ మోడ్ బటన్ ను నొక్కగానే కాక్‌పిట్‌లో ఒకటి లేదా రెండు సీట్లు 90 డిగ్రీల కోణంలో ముందుకు జరుగుతాయి. రెండు రెక్కలున్న బైప్లేన్ లాగా కారు మారిపోతుంది. ఈ ఎగిరే కారు ముందుకు, వెనుకకు, పైకి, క్రిందికి, కుడివైపు, ఎడమవైపు, ఎక్కడికైనా డ్రైవర్ సూచనల ప్రకారం ఈజీగా దిశను మార్చుకుంటుంది. అలెఫ్ ఫ్లయింగ్ కారు నడిచేందుకు ఎనిమిది మోటర్ల ద్వారా శక్తి లభిస్తుంది.

ఇందులో డిటెక్షన్ సిస్టమ్, పారాచూట్‌ ఉంటాయి. ఈ కారును హైడ్రోజన్ ఇంజన్ వర్షన్ లోనూ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలెఫ్ ఫ్లయింగ్ కార్ల ఉత్పత్తి 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కార్ల డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఎగిరే కారును సెలబ్రిటీ డిజైనర్ హిరాష్ రాజాగీ డిజైన్ చేశారు. గతంలో ఆయన బుగాటీ, జాగ్వార్ కార్ల మోడల్‌లను కూడా రూపొందించాడు.


Similar News