US presidential debate: లంచ్ లో ట్రంప్ ని మింగేసే వాడు.. మాజీ అధ్యక్షుడికి కమలా హ్యారిస్ కౌంటర్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థుల మధ్య తొలిసారి డిబేట్ జరిగింది.

Update: 2024-09-11 07:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థుల మధ్య తొలిసారి డిబేట్ జరిగింది. 90 నిమిషాలపాటు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కమలా హ్యారిస్(Kamala Harris) మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చలో అబార్షన్ల నుండి యుద్ధాల వరకు, ఆర్థిక వ్యవస్థ నుండి గృహ సంక్షోభం వరకు ఇలా పలు అంశాలపై చర్చ జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలాడెల్ఫియాలో ఏబీసీ మీడియా ఏజెన్సీ ద్వారా జరిగింది. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉద్రిక్తతలు తలెత్తేవే కావన్నారు. ‘మీరు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ విజయం(Russia-Ukraine war) సాధించాలని కోరుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు.. ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. స్పష్టంగా జవాబు చెప్పకుండా ఇవ్వకుండా యుద్ధం ఆగిపోవాలని భావిస్తున్నా అని డొంకతిరుగుడు సమాధానమిచ్చారు. ‘ఈ యుద్ధాన్ని ముగించడం అమెరికాకు ఉత్తమమని నేను భావిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

పుతిన్ ట్రంప్ ని మింగేసే వాడు- హ్యారిస్

ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలకు కమలా హ్యారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి తలవంచేవాడని.. అప్పుడు పుతిన్ కీవ్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. ‘పుతిన్ కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో మొదలుపెట్టి యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉంటాడు.. మిమ్మల్ని లంచ్ లో మింగేసే లాంటి నియంత అని తెలిసినా వారితో స్నేహం చేశారు. అయినా, అంత త్వరగా మీకు అనుకూలంగా ఉన్నవారిని ఎలా వదులుకుంటారు’ అని ట్రంప్‌కి కమలా హ్యారిస్ చురకలంటించారు.

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై చర్చ

ఇక, ఇజ్రాయెల్-హమాస్ యుద్దం గురించి కూడా డిబేట్ లో చర్చకు వచ్చింది. ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కమలా హ్యారిస్ అన్నారు. అయితే, తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు ఆ ప్రాంతంలోని అరబ్బులను హ్యారిస్ ద్వేషిస్తారన్నారు. కాగా.. ఆ వ్యాఖ్యలను హ్యారిస్ ఖండించారు. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని.. కానీ, ఈ యుద్ధం ముగియాలని బలంగా కోరుకుంటున్నామన్నారు. ట్రంప్‌ నియంతలను ఆరాధిస్తారని.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ఆయన లవ్ లెటర్స్ రాశారని చురకలు అంటించారు. ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారని.. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారని హ్యారిస్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే క‌మ‌లా హ్యారిస్‌ను ట్రంప్ మార్క్సిస్ట్ గా అభివర్ణించగా, ఆమె చిరున‌వ్వుతో స‌రిపెట్టారు. ఇదిలాఉంటే.. 2024 ఎన్నికలు కూడా 2020 మాదిరిగానే ట్రంప్, బైడెన్ మ‌ధ్య‌ అధ్యక్షపోరు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలగడంతో కమలా హ్యారిస్ అభ్యర్థిగా ఖరారయ్యారు.


Similar News