జర్మనీలో ISIS తరహా దాడికి ప్లాన్ చేసినందుకు ముగ్గురు టీనేజర్ల అరెస్ట్
పశ్చిమ జర్మనీలో ISIS తరహా దాడికి ప్లాన్ చేస్తున్నారని ముగ్గురు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం తెలిపారు
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ జర్మనీలో ISIS తరహా దాడికి ప్లాన్ చేస్తున్నారని ముగ్గురు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం తెలిపారు. 15 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు, ఒక అబ్బాయి ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు కూడా డ్యూసెల్‌డార్ఫ్ ప్రాంతానికి చెందినవారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పేరుతో కొంతమంది యువకులు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని చూస్తున్నట్లు బిల్డ్ వార్తాపత్రిక ఇంతకుముందు నివేదించగా, తాజాగా ఈ ముగ్గురు టీనేజర్లను అరెస్ట్ చేయడం గమనార్హం.
అక్టోబరులో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి జర్మనీలో ఇస్లామిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. నూతన సంవత్సర పండుగ సందర్భంగా కొలోన్‌లోని కేథడ్రల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై జనవరిలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇటీవల, ఖురాన్ దహనానికి ప్రతీకారంగా స్వీడన్ పార్లమెంట్‌పై దాడికి ప్లాన్ చేశారనే అనుమానంతో ISతో సంబంధం ఉన్న ఇద్దరు ఆఫ్ఘన్‌లను మార్చిలో జర్మనీలో అరెస్టు చేశారు. ఇస్లామిస్ట్ తీవ్రవాదులు జర్మనీలో డిసెంబర్ 2016న బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్‌లో జరిపిన విధ్వంసంలో 12 మంది మరణించారు.