‘నెతన్యాహును సంప్రదించకుండానే హమాస్ నాయకుడి కుమారులు, మనవళ్లని చంపారు’

ఇజ్రాయెల్ బుధవారం ఉత్తర గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, ముగ్గురు బాలికలు, ఒక అబ్బాయి మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-04-11 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ బుధవారం ఉత్తర గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, ముగ్గురు బాలికలు, ఒక అబ్బాయి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా సీనియర్ కమాండర్లను సంప్రదించకుండానే ఈ వైమానిక దాడి జరిగిందని ఆ దేశ మీడియా గురువారం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం, షిన్ బెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సమన్వయంతో జరిగిన ఈ దాడి గురించి ముందుగా నెతన్యాహుతో గానీ, ఇతర సీనియర్ అధికారులతో చెప్పకుండానే దాడి చేశారని పేర్కొంది.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు అమీర్, మహ్మద్, హజెమ్ హనియెహ్‌తో పాటు, అతని మనవళ్లు కూడా చనిపోయారు. ఈ మరణాలను మొదట అల్ జజీరా నివేదించగా, ఆ తర్వాత హనియా బుధవారం ఒక ఇంటర్వ్యూలో మరణాలను ధృవీకరించారు. జెరూసలేం, అల్-అక్సా మసీదును విముక్తి చేసే సమయంలో తన కుమారులు అమరులయ్యారని అన్నారు. ఆయన ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రపంచ దేశాలు సంధి కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు హమాస్ నాయకుడి కుమారులు మరణించడం వలన ఈ సంధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంధీలను విడిచే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు.


Similar News