Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ‌పై హనీ ట్రాపింగ్ ?.. ఆ మిస్టరీ మహిళ ఎవరు ?

దిశ, నేషనల్ బ్యూరో : సోషల్ మీడియా ప్రపంచంలో టెలిగ్రామ్ ఒక సంచలనం.

Update: 2024-08-26 15:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సోషల్ మీడియా ప్రపంచంలో టెలిగ్రామ్ ఒక సంచలనం. ఈ కంపెనీ సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేయడంపై అంతటా చర్చ జరుగుతోంది. నేరపూరిత కార్యకలాపాల కోసం టెలిగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నా అడ్డుకోవడం లేదనే అభియోగాలతో పావెల్ దురోవ్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టు వెనుక 24 ఏళ్ల జూలీ వావిలోవా అనే మిస్టరీ మహిళ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా పావెల్ దురోవ్‌‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఈ మహిళ నేపథ్యంపై అంతటా చర్చ జరుగుతోంది.

దుబాయ్‌లో పరిచయమై..

పావెల్ దురోవ్ రష్యాలో పుట్టినప్పటికీ, ఎక్కువగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్‌ పౌరసత్వాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలోనే దుబాయ్‌లో పావెల్ దురోవ్‌‌‌కు జూలీ వావిలోవా పరిచయమయ్యారు. వీరిద్దరూ కలిసి గతంలో చాలాసార్లు ప్రైవేటు విమానంలో చాలా దేశాల టూర్లకు వెళ్లొచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలను జూలీ వావిలోవా ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవారు. ఈక్రమంలోనే వీరిద్దరు గత శనివారం రోజు ప్రైవేటు విమానంలో అజర్ బైజాన్ నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌‌కు బయలుదేరారు. ప్యారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు చుట్టుముట్టి పావెల్ దురోవ్‌, జూలీ వావిలోవాలను అదుపులోకి తీసుకున్నారు.

దేశం పేరు తప్ప..

జూలీ వావిలోవా నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండేది. అందులో ఆమె ఏ దేశంలో పుట్టింది అనే సమాచారం తప్ప అన్ని వివరాలను ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్ ఏజెంట్ అయి ఉండొచ్చని, టెలిగ్రామ్ సీఈఓపై హనీ ట్రాప్ కోసం మోసాద్ పంపి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్, అరబిక్ భాషలు వస్తాయని ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో జూలీ వావిలోవా ప్రస్తావించడం గమనార్హం.


Similar News