ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కొనీ కన్నుమూత..

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని కన్నుమూశారు.

Update: 2023-06-12 15:19 GMT

రోమ్‌ : ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని కన్నుమూశారు. 86 ఏళ్ళ బెర్లుస్కోని మిలన్ నగరంలోని శాన్ రఫేల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణల నుంచి బయటపడిన ఆయన కొన్నేళ్లుగా ల్యుకేమియా వ్యాధి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అంతకుముందు గుండె జబ్బు, ప్రొస్టేట్ క్యాన్సర్‌ కూడా సోకింది. ఇటీవల ఇటలీ ఎగువ సభ సెనేట్‌కు ఆయన ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని వామపక్ష సర్కారులో మిత్రపక్షంగా బెర్లుస్కోనికి చెందిన రాజకీయ పార్టీ చేరింది.

ఆయన 1936లో ఇటలీలోని మిలాన్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. న్యాయపట్టా అందుకున్నారు. ఒకప్పుడు క్రూజ్ షిప్‌లో గాయకుడైన బెర్లుస్కోని.. నిర్మాణ రంగం, ఆపై మీడియా రంగంలోకి ప్రవేశించి కుబేరుడిగా ఎదిగారు. దేశంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. ఫోర్జా ఇటాలియా అనే పార్టీని స్థాపించి 1994లో తొలిసారి దేశ ప్రధాని అయ్యారు. 2011 వరకు నాలుగుసార్లు ప్రధానిగా ప్రభుత్వాన్ని నడిపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బెర్లుస్కొనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల 86వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపి వోడ్కా కూడా పంపారు. ప్రతిగా బెర్లుస్కోని ఆయనకు ఇటాలియన్ వైన్‌ బహుమతిగా పంపించడం విశేషం.


Similar News