రష్యా దాడులు అత్యంత నీచమైనవి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

ఉక్రెయిన్‌లోని నల్ల సముద్రపు ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా దళాలు దాడికి పాల్పడగా 20 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు.

Update: 2024-03-16 05:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌లోని నల్ల సముద్రపు ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా దళాలు దాడికి పాల్పడగా 20 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రష్యా దాడిని అత్యంత నీచమైనదిగా అభివర్ణించారు. రష్యా దళాలు పోర్ట్ హబ్‌పై డబుల్-ట్యాప్ స్ట్రైక్ అని పిలిచే ఒక రకమైన దాడిని ప్రారంభించగా.. కార్మికులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. రష్యా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. మరోవైపు నివాస భవనాలు, అంబులెన్స్‌లు, గ్యాస్ పైప్‌లైన్‌పై రష్యా దళాలు దాడి చేశాయని, దీంతో 20 మంది మృతి చెందగా.. మరో 73 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని వెల్లడించారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియన్ ద్వీపకల్పం నుంచి ఒడెసాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

ఈ దాడులపై రష్యా అధికారికంగా స్పందించలేదు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో దళాలు డ్రోన్లు, క్షిపణులతో రవాణా కేంద్రాలను లక్ష్యంగా అటాక్‌కు పాల్పడుతున్నాయి. మరోవైపు రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన మొదటి రోజున సమ్మెలు జరిగాయి. అలాగే ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో కూడా ఓటింగ్ నిర్వహించారు. దీంతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా 50కి పైగా సభ్య దేశాలు రష్యాపై మండిపడ్డాయి. చట్టవిరుద్ధంగా ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నించిందని, దానికి చట్ట పరమైన అనుమతి లేదని విమర్శించాయి.

Tags:    

Similar News