పడవ బోల్తా ఘటనలో 12 మంది పాక్ జాలర్లు మృతి

అరేబియా సముద్రంలో మార్చి 5న పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది పాకిస్తాన్ జాలర్లు మరణించారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పాకిస్తాన్ మిలిటరీ అధికారులు బుధవారం తెలిపారు.

Update: 2024-03-13 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో మార్చి 5న పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది పాకిస్తాన్ జాలర్లు మరణించారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పాకిస్తాన్ మిలిటరీ అధికారులు బుధవారం తెలిపారు. కరాచీలోని ఇబ్రహీం హైదరీ ప్రాంతానికి చెందిన 45 మంది మత్స్యకారులు పడవలో చేపల వేటకు వెళ్లగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మార్చి 5న తెల్లవారుజామున 3 గంటలకు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది జాలర్లు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్లు, ఓడలు, స్పీడ్‌బోట్‌లతో రక్షణ చర్యలను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకోగా, మిగిలిన రెండు మృతదేహాల కోసం వెతుకుతున్నట్లు వారు తెలిపారు. గల్లంతైన వారి మృతదేహాలు సముద్ర అలల తాకిడికి భారత ప్రాదేశిక జలాల్లోకి వెళ్లి ఉండే అవకాశం ఉందని వారి బంధువులు పేర్కొంటున్నారు.


Similar News