భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఖండించిన పాక్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దును దాటి ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్‌ పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే

Update: 2024-04-06 08:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దును దాటి ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్‌ పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే శనివారం ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. భారత రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ద్వేషపూరిత వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ప్రాంతీయ శాంతిని దెబ్బతీయడమే కాకుండా, దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్చలకు ఆటంకం కలిగిస్తుంది. ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడం కోసం ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భారతదేశం తన పొరుగు దేశాలతో ఆరోగ్యకరమైన సంబంధాలను కోరుకుంటుందని, అయితే ఎవరైనా భారతదేశానికి ధైర్యం చేసి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే, వారిని విడిచిపెట్టబోమని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఎవరైనా ఉగ్రవాది భారత్‌కు నష్టం కలిగించేందుకు ప్రయత్నించినా, ఇక్కడ తీవ్రవాద చర్యలకు పాల్పడినా తగిన సమాధానం ఇస్తాం. అతడు పాకిస్థాన్‌కు పారిపోతే అక్కడికి వెళ్లి చంపేస్తాం అని ఆయన అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై పాక్ కీలక ప్రకటన విడుదల చేసింది.


Similar News