రిగ్గింగ్ నిజమే.. ఎన్నికల అధికారి సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికలపై ప్రశ్నలు లేవనెత్తేలా సాక్షాత్తూ ఓ పోలింగ్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-02-17 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికలపై ప్రశ్నలు లేవనెత్తేలా సాక్షాత్తూ ఓ పోలింగ్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని రావల్పిండి మాజీ కమిషనర్‌ లియాఖత్‌ అలీ చత్తా ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందన్నారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోవాల్సిన అభ్యర్థులను గెలిచేలా చేశారు. ఈ అవకతవకలకు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో ప్రధాన ఎన్నికల అధికారి, ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం ఉంది. దేశానికి వెన్నుపోటు పొడిచాను. అది నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు’’ అని ఆయన మీడియాకు చెప్పారు. ‘‘మేం చేసిన అన్యాయానికి మాకు శిక్ష పడాలి. ఆత్మహత్య చేసుకునేంతగా నాపై ఒత్తిడి వచ్చింది. చివరకు ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకున్నాను. ఈ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయొద్దని అధికారులను అభ్యర్థిస్తున్నాను’’ అని లియాఖత్‌ అలీ చత్తా పేర్కొన్నారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. అయితే ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. సాధారణంగానైతే 9వ తేదీ రాత్రిలోగా మొత్తం ఫలితాలు వెలువడాలి. కానీ 11వ తేదీ వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతోందని ఎన్నికల సంఘం ప్రకటించడం అనుమానాలకు తావిచ్చింది. ఈనేపథ్యంలో లియాఖత్ చేసిన ఆరోపణలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో మెజారిటీ సీట్ల (101)ను ఇండిపెండెంట్లుగా పోటీచేసిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులు గెల్చుకున్నారు. రెండో, మూడో స్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలు కలిసి ఇప్పుడు సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రెడీ అవుతున్నాయి.

Tags:    

Similar News