North Korea: మరోసారి నార్త్ కొరియా కవ్వింపు చర్యలు.. తూర్పు సముద్రం వైపుగా మిస్సైల్స్ ప్రయోగం

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆ దేశ తూర్పు సముద్రం వైపుగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

Update: 2024-09-12 03:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆ దేశ తూర్పు సముద్రం వైపుగా గురువారం పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు నెలల వ్యవధి తర్వాత నార్త్ కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. దీనిని జపాన్ కోస్ట్ గార్డ్ సైతం ధ్రువీకరించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణులు జపాన్ జలాల్లో దిగడానికి 360 కిలోమీటర్ల ముందే గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే కిమ్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

ఉత్తర కొరియా నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే దీని వల్ల ఎటువంటి నష్టం జరిగింది అనే వివరాలను వెల్లడించలేదు. ఈ క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా స్పందించారు. ఓడలు, విమానాల భద్రతపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కిమ్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా, ఉత్తర కొరియా చివరిసారిగా జూలై 1న క్షిపణులను ప్రయోగించింది. 4.5 టన్నుల సూపర్-లార్జ్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. 


Similar News