Maori King: న్యూజిలాండ్ మావోరీ రాజు తుహేటియా మృతి
న్యూజిలాండ్‌లో స్థానిక మావోరీ ప్రజల రాజు, కింగి తుహేటియా పూటటౌ తే వీరోహీరో VII, శుక్రవారం మృతి చెందారు
దిశ, నేషనల్ బ్యూరో: న్యూజిలాండ్‌లో స్థానిక మావోరీ ప్రజల రాజు, కింగి తుహేటియా పూటటౌ తే వీరోహీరో VII, శుక్రవారం మృతి చెందారు. 69 ఏళ్ల వయసు కలిగిన ఆయన తన 18వ పట్టాభిషేకం వార్షికోత్సవాన్ని జరుపుకున్న కొద్ది రోజులకే గుండె శస్త్రచికిత్స చేసుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో తన కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారు. నివేదికల ప్రకారం, ఆయన ఇటీవలి సంవత్సరాలలో క్యాన్సర్, మధుమేహంతో సహా ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.
న్యూజిలాండ్‌లో మావోరీ చక్రవర్తి స్థానం 1858లో మొదలైంది. మావోరీ చక్రవర్తిని అనేక తెగలకు అధిపతిగా పరిగణిస్తారు. చక్రవర్తికి న్యాయపరమైన లేదా చట్టపరమైన అధికారం లేనప్పటికి అక్కడి తెగలకు నాయకత్వం వహిస్తారు. న్యూజిలాండ్‌లో దాదాపు 900,000 మంది మావోరీ ప్రజలు ఉన్నారు, మొత్తం జనాభాలో దాదాపు 17 శాతానికి సమానం. మావోరీ సంఘం తరచుగా వివక్షను ఎదుర్కొంటుంది. దీంతో వారు ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని అందుకోలేకపోతున్నారు. వారికి ప్రతినిధిగా చక్రవర్తి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. తుహెటియాకు భార్య.. తే అటావాయ్, ఇద్దరు కుమారులు.. వాటుమోనా, కొరోటాంగి, కుమార్తె.. న్గా వై హోనో ఐ తే పో పాకి ఉన్నారు.
న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తుహెటియాకు నివాళులర్పించారు, రాజు మరణానికి దేశం సంతాపం తెలియజేస్తుందని అన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ ఒక ప్రకటనలో, తుహెటియా మరణం గురించి తెలుసుకుని తాను, రాణి కెమిల్లా తీవ్రమైన విచారానికి గురయ్యామని, ఒక శక్తివంతమైన టోటోరా చెట్టు పడిపోయిందని మావోరీ సామెతను ప్రస్తావించారు. ఇదిలా ఉంటే మావోరీ తదుపరి చక్రవర్తి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.