ఎవరెస్ట్ పైకి వెళ్లాలంటే ఇకపై ఇవి తప్పనిసరి

ఎవరెస్ట్ పర్వతారోహకులకు తాజాగా నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Update: 2024-03-12 13:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎవరెస్ట్ పర్వతారోహకులకు తాజాగా నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పర్వతారోహకులు ఇక మీదట తప్పనిసరిగా GPS ట్రాకర్‌లను పెట్టుకోవడంతో పాటు, కుక్కల వ్యర్థాల కోసం ఉపయోగించే కంపోస్టబుల్ బ్యాగ్‌లను ఉపయోగించి వారి మల విసర్జనను తొలగించాలని నేపాల్ పర్యాటక శాఖలోని పర్వతారోహణ డైరెక్టర్ రాకేష్ గురుంగ్ మంగళవారం తెలిపారు.

GPS ట్రాకర్‌లను ఇప్పటికే చాలా మంది ప్రొఫెషనల్ పర్వతారోహకులు ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారిని కనిపెట్టవచ్చు. కొన్నేళ్లుగా ఎవరెస్టు పర్వతంపై చాలా మంది చనిపోతున్నారు. మంచులో వారిని కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో GPS ట్రాకర్‌లను తప్పనిసరి చేశారు. గత సంవత్సరం ఎవరెస్ట్‌పై 18 మంది అధిరోహకులు మరణించగా, ఇంకా కనీసం ఐదు మృతదేహాలు వెలికితీయలేదు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండటానికి, భద్రతను మెరుగుపరచడానికి పర్వతారోహకులు ట్రెక్కింగ్ సమయంలో ట్రాకర్‌లను అమర్చుకోవాలని అధికారులు తెలిపారు.

అలాగే ఎవరెస్ట్‌పై టన్నుల కొద్ది భారీగా చెత్త పేరుకుపోతుంది. ఖాళీ డబ్బాలు, సీసాలు, గ్యాస్ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు, మానవ వ్యర్థాలతో ఎత్తైన పర్వతం కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్వతారోహకులు GPS ట్రాకర్‌లతో పాటు, తమ మలాన్ని తప్పనిసరిగా తొలగించాలని తెలిపింది. బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను ఉపయోగించి దానిని తిరిగి బేస్‌ క్యాంప్‌కి తీసుకొచ్చి పారవేయాలని అధికారులు తెలిపారు.


Similar News