క్యాన్సర్ ప్రకటన తరువాత మొదటిసారి జనాలను కలిసిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు చార్లెస్ III ఈస్టర్ సందర్భంగా ప్రార్థన కోసం ఆదివారం చర్చికి వెళ్లారు.
దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ రాజు చార్లెస్ III ఈస్టర్ సందర్భంగా ప్రార్థన కోసం ఆదివారం చర్చికి వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో క్యాన్సర్ వచ్చినట్లు ప్రకటించిన తరువాత మొదటిసారి చార్లెస్ III బహిరంగంగా కనిపించారు. 75 ఏళ్ల వయసు కలిగిన ఆయన తన భార్య క్వీన్ కెమిల్లాతో లండన్‌కు పశ్చిమాన విండ్సర్ కాజిల్ మైదానంలో ఉన్న 14 శతాబ్దపు భవనం సెయింట్ జార్జ్ చాపెల్‌లో ప్రార్థనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూట్, లేత నీలం రంగు టై ధరించి ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించే ముందు బయట వేచిచూస్తున్న జనాలకు చేతులు ఊపుతూ, ఉల్లాసంగా కనిపించారు. అలాగే కొంతమందితో కరచాలనం చేసి, కొద్దిసేపు కొందరితో మాట్లాడారు.
ఈస్టర్ వేడుకలకు హాజరు కావడం అనేది రాజకుటుంబీకులకు చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. ఫిబ్రవరి ప్రారంభంలో చార్లెస్ III కి క్యాన్సర్ వచ్చిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. చికిత్స తీసుకుంటున్న ఆయన అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. కేవలం ప్యాలెస్ లోపల జరిగే ముఖ్యమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొనేవారు. తాజాగా ఇప్పుడు బహిరంగంగా ప్రజలకు కనిపించారు.