Iswaran: భారత సంతతి మాజీ మంత్రికి సింగపూర్‌లో ఏడాది జైలు శిక్ష.. కారణమిదే?
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మాజీ రవాణా మంత్రి ఈశ్వరన్‌కు ఆ దేశ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
దిశ, నేషనల్ బ్యూరో: సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మాజీ రవాణా మంత్రి ఈశ్వరన్‌కు ఆ దేశ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల పాటు విలువైన బహుమతులను స్వీకరించిన కేసులో ఆయన దోషిగా తేలారు. దీంతో కోర్టు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి విన్సెంట్ హూంగ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి బహుమతులు తీసుకుని తన పదవిని దుర్వినియోగం చేశారని తెలిపారు. ప్రభుత్వ సేవకుడిగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటే, నేరస్థుల స్థాయి అంత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈశ్వరన్ తరపు న్యాయవాది వాదిస్తూ ఎనిమిది నెలల కంటే ఎక్కువ శిక్ష విధించకూడదని తెలిపారు. డిప్యూటీ అటార్నీ జనరల్ తై వీ షియోంగ్ ఆరు నుంచి ఏడు నెలల వరకు శిక్ష విధించాలని కోరారు. అయితే ఇరువురి అభిప్రాయాలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. కాగా, 1962లో తమిళనాడులోని చెన్నయ్‌లో జన్మించిన ఈశ్వరన్ సింగపూర్‌కు వలస వెళ్లాడు. 2021 నుంచి 2024 మధ్య ఆ దేశ రవాణా మంత్రిగా పని చేశారు.