BAGHDAD: ఇరాక్‌ పర్యటనలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు

మిడిల్‌‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బుధవారం ఇరాక్‌లో పర్యటిస్తున్నారు

Update: 2024-09-11 09:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్‌‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బుధవారం ఇరాక్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో అధికారం చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనను ఇరాక్‌లో చేపట్టారు. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్-సుదానీ బాగ్దాద్ విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు మసౌద్‌కు స్వాగతం పలికారు. అక్కడే కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను విధించడంతో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టడానికి అలాగే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై US నేతృత్వంలోని ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి పొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించుకున్నాడు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాకు స్వల్ప-శ్రేణి క్షిపణులను సరఫరా చేసినందుకు పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై ఆంక్షలను మంగళవారం ప్రకటించిన తర్వాత ఆయన పర్యటన జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించిన తరువాత జులైలో ఇరాన్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పెజెష్కియన్, తన పొరుగు దేశాలతో వాణిజ్యం, ఇతర సంబందాలను పెంచుకోవాలని చూస్తున్నాడు. తాజా పర్యటనలో పెజెష్కియాన్ ఇరాక్‌‌లోని షియా పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు.


Similar News