అమెరికాలో ఘనంగా ఇండియా డే వేడుకలు
అమెరికాలోని న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కవాతులో భారత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు పరేడ్ లో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, భారత జెండాలను పట్టుకుని ధోల్‌లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ కనిపించారు.కాగా ఈ కవాతులో భాగంగా రామమందిరంతో కూడిన కార్నివాల్ ఫ్లోట్ తయారు చేశారు. చెక్కతో తయారు చేయబడిన ఈ ఫ్లోట్ ఎక్కువగా రామమందిరాన్ని వర్ణిస్తుంది. దాదాపుగా 18 అడుగుల పొడవు, తొమ్మిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఈ ఫ్లోట్ భారతదేశంలో చెక్కబడింది. కవాతులో పాల్గొనడానికి ఈ ఫ్లోట్ ఎయిర్ కార్గో ద్వారా ఇండియా నుంచి న్యూయార్క్ కు రవాణా చేయబడింది.
అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకారం,ఈ కవాతులో ప్రముఖులతో పాటు 40కి పైగా ఫ్లోట్‌లు, 50కి పైగా కవాతు బృందాలు అలాగే 30కి పైగా కవాతు బ్యాండ్‌లు పాల్గొన్నాయి. ఇండియా తరుపున పాల్గొన్న స్వామి అవధేశానంద్ గిరి జీ అనే మహారాజ్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. “ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఆహ్వానం మేరకు ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడానికి నేను న్యూయార్క్ వచ్చాను. ఇండియా డే పరేడ్‌లో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశం యొక్క దైవిక సంస్కృతి, మన కలలు , సనాతన సంస్కృతి దాని విలువలు ఈ పరేడ్ లో కనిపించాయని స్వామి అవధేశానంద్ గిరి జీ తెలిపారు.కాగా ఈ కవాతులో గౌరవ అతిథులుగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటుడు పంకజ్ త్రిపాఠి అలాగే పార్లమెంటు సభ్యుడు మనోజ్ తివారీ పాల్గొన్నారు.