Bangladesh : ‘బంగ్లా’ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎందుకు రాజీనామా చేశారు ?

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనకారులు రోడ్డుపైకి వచ్చారు.

Update: 2024-08-10 13:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో మళ్లీ నిరసనకారులు రోడ్డుపైకి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటూ శనివారం ఉదయం 10.30 గంటలకు రాజధాని ఢాకాలోని సర్వోన్నత న్యాయస్థానాన్ని వందలాది మంది విద్యార్థులు, న్యాయవాదులు చుట్టుముట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటలోగా రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్ల ఒబేదుల్ హసన్‌కు విద్యార్థుల నిరసన వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ ఆలోగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జీలు రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల ఇళ్లను చుట్టుముడుతామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆవరణలో హైటెన్షన్ వాతావరణం నేపథ్యంలో అక్కడి నుంచి హుటాహుటిన ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్‌ వెళ్లిపోయారు. ఇక మధ్యాహ్నం 1 గంటల సమయానికి విద్యార్థులు భారీ సంఖ్యలో సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. దీంతో సరిగ్గా ఆ సమయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్‌ కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా ఉన్న దిగువ కోర్టుల న్యాయమూర్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం సాయంత్రంలోగా తన రాజీనామా లేఖను దేశాధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌కు పంపుతానని స్పష్టం చేశారు. ఇక బంగ్లాదేశ్‌ కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ అబ్దుర్‌ రవూఫ్‌ తాలుక్‌దెర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే ఆందోళనకారులు ఈ బ్యాంక్‌ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

రాజీనామా డిమాండ్ ఎందుకు వచ్చింది ?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్‌ ఇతర న్యాయమూర్తులతో శనివారం ఫుల్ కోర్టు సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే దీనికి బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. దీనిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టును చుట్టుముట్టాయి. దీంతో న్యాయమూర్తుల సమావేశం మధ్యలోనే ఆగిపోయింది. కొన్ని గంటల్లోనే ప్రధాన న్యాయమూర్తి రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఒబైదుల్‌ హసన్‌ గత ఏడాదే బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు విధేయుడిగా ఉండేవారు. దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్‌ హసన్‌ కూడా దేశం విడిచి పారిపోతారనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి.

భద్రతపై హామీ ఇవ్వండి.. ఆర్మీ చీఫ్‌‌కు బీసీబీ విజ్ఞప్తి

బంగ్లాదేశ్‌లో అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ప్లేయర్ల భద్రతపై తమకు హామీ ఇవ్వాలని ఆ దేశ ఆర్మీ చీఫ్‌‌ వకారుజ్జమాను బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. ఈమేరకు ఆయనకు లేఖ రాసింది. ఒకవేళ బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యం కాకపోతే భారత్‌తోపాటు యూఏఈ, శ్రీలంకలలో నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. 

Tags:    

Similar News