రూ.54 లక్షల విలువైన టీకప్‌ను దొంగలించిన వ్యక్తి

జపాన్‌లో అత్యంత విలువైన బంగారు టీకప్‌ను దొంగలించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది.

Update: 2024-04-11 12:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్‌లో అత్యంత విలువైన బంగారు టీకప్‌ను దొంగలించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ టీకప్ ధర దాదాపు అక్షరాల రూ.54,18,468(10 మిలియన్ యెన్ ($65,000)). ఇది స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారంతో తయారు చేయబడింది. దీనిని జపనీస్ డిపార్ట్‌మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అమ్మకానికి ఉంచారు. అయితే దానిని చూడటానికి వచ్చిన వారిలో ఒకరు దీనిని దొంగలించారు. దీనికి సంబంధించి సెక్యూరిటీ ఫుటేజీలో ఒక వ్యక్తి టీకప్‌ను తీసుకుని తన బ్యాగ్‌లో పెట్టుకుని అక్కడి నుండి పారిపోతున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

1,000కు పైగా మెరుస్తున్న టీవేర్, టేబుల్‌వేర్ వంటి బంగారు కళాఖండాలను స్టోర్‌లో అమ్మకానికి ప్రదర్శనగా ఉంచారు. ఈ బంగారు టీకప్‌ను అన్‌లాక్ చేయబడిన పారదర్శక పెట్టెలో ఉంది. ఇది బయటకు తీయడానికి సులువుగా ఉండటంతో ఆ వ్యక్తి ఈజీగానే దీనిని చోరీ చేశాడు. ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి వస్తువులలో ఈ బంగారు టీకప్ అత్యంత విలువైనదని సంబంధిత స్టోర్ మెంబర్స్ తెలిపారు. ఈ చోరీ తరువాత కూడా స్టోర్‌లో మిగతా వస్తువుల అమ్మకాలను యధావిథిగా నిర్వహిస్తామని, అయితే ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని స్టోర్ ప్రతినిధులు తెలిపారు.


Similar News