26/11 సూత్రధారికి 78ఏళ్ల జైలు శిక్ష

హఫీజ్ సయీద్ పాకిస్థాన్ కస్టడీలో ఉన్నాడని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తెలిపింది.

Update: 2024-01-10 05:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ కస్టడీలో ఉన్నాడని, అంతేగాక 78ఏళ్ల జైలు శిక్ష సైతం అనుభవిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తెలిపింది. టెర్రరిస్టులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు గాను 7 కేసుల్లో దోషిగా తేలినందున సయీద్.. ఫిబ్రవరి 12, 2020 నుంచి కస్టడీలో ఉన్నట్టు పేర్కొంది. 2008లో సయీద్‌ను ఐక్యరాజ్యసమితి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ ప్రకారం.. ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా ఐరాస సెక్యురిటీ కౌన్సిల్ ఆంక్షల కమిటీ సవరించిన జాబితాలో ఈ వివరాలు పొందుపర్చింది. గత నెలలోనూ సెక్యురిటీ కౌన్సిల్ ఆల్ ఖైదా ఆంక్షల కమిటీలోని వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సవరించింది. అందులో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, సయీద్ డిప్యూటీ అబ్దుల్ సలామ్ భుట్టావి మరణించినట్టు ధ్రువీకరించింది. ఉగ్రవాద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ గతేడాది మేలో పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ జైలులో మృతి చెందినట్టు తెలిపింది. కాగా, హఫీజ్ సయీద్‌ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది. ముంబైలో జరిగిన 26/11 మారణహోమానికి ప్రధాన సూత్రధారి. ఇటీవలే హఫీజ్‌ను తమకు అప్పగించాలని పాక్‌ను భారత్ అభ్యర్థించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News