Myanmar: మయన్మార్ కు మరోసారి సాయం చేయనున్న భారత్
మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్ (Thailand)లను వరుస భూకంపాలు కలవరపెడుతున్నాయి. అక్కడి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది.
దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్ (Thailand)లను వరుస భూకంపాలు కలవరపెడుతున్నాయి. అక్కడి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు మయన్మార్ లో వెయ్యమందికి పైగా చనిపోయారు. అయితే, ఇలాంటి సమయంలో ఆ దేశానికి సాయమందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్.. మయన్మార్ కు ఆపరేషన్ బ్రహ్మ పేరుతో తక్షణ సాయం అందిస్తుంది. ఇప్పటికే ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అయితే, ఇప్పుడు మరోసారి హెల్ప్ చేసేందుకు భారత్ రెడీ అయ్యింది. సహాయకచర్యలు చేపట్టేందుకు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. ‘‘మయన్మార్‌కు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. ఈవిషయంపై సమావేశమై చర్చించాం. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది (NDRF team) అక్కడికి బయలుదేరనున్నారు. ఘజియాబాద్‌లోని ఎన్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్‌కు చెందినవారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా, భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇతరదేశాలకు పంపడం ఇది మూడోసారి. 2015లో నేపాల్‌లో భూకంపం వస్తే అక్కడ సహాయకచర్యలు అందించింది. 2023లో టర్కీలో భూకంపం రాగా.. రక్షణ కార్యకలాపాలకు సాయం చేసేందుకు కూడా పంపింది.
శుక్రవారం అర్ధరాత్రి కంపించిన భూమి
కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. మరో 2 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. ఇకపోతే మయన్మార్ కు అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు. ఈనేపథ్యంలోనే మరోసారి మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ సిద్ధమైంది.