పాకిస్థాన్‌లో బొగ్గు గని కూలిన ఘటనలో 12 మంది మైనర్లు మృతి

పాకిస్తాన్‌లో బొగ్గు గని కూలిన ఘటనలో బుధవారం ఉదయం మరో పది మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు.

Update: 2024-03-20 10:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో బొగ్గు గని కూలిన ఘటనలో బుధవారం ఉదయం మరో పది మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు. దీంతో మొత్తంగా 12 మృతదేహాలను వెలికితీయడంతో సహాయక చర్యలు ముగిశాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం దక్షిణ పాకిస్తాన్‌లోని ఖోస్ట్ మైనింగ్ ప్రాంతంలోని ప్రైవేట్ బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మైనర్లు చిక్కుకున్నారు.

రెస్క్యూ బృందాలు ఎనిమిది మందిని రక్షించగా, మిగిలిన వారిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ 12 మంది చనిపోయారు. ఇద్దరి మృతదేహాలను మంగళవారం రాత్రి వెలికితీయగా, మరో 10 మంది కోసం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా, బుధవారం ఉదయం వారి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.

బలూచిస్థాన్ ప్రావిన్స్ మైన్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ మాట్లాడుతూ, మీథేన్ గ్యాస్ పేలడం వలనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇటీవల కాలంలో ప్రమాదకర పని పరిస్థితులు, పేలవమైన భద్రతా ప్రమాణాల కారణంగా పాకిస్తాన్ గనులలో ఇలాంటి ఘోరమైన సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. గతంలో మే 2018లో, అదే ప్రాంతంలోని రెండు బొగ్గు గనులలో గ్యాస్ పేలుళ్ల కారణంగా 23 మంది మరణించగా,11 మంది గాయపడ్డారు.


Similar News