చిక్కుల్లో అందగత్తెలు
దిశ, వెబ్‌డెస్క్ : అందాల పోటీలు అనగానే ఎక్కడో ఒక దగ్గర వివాదం రాజుకుంటూనే ఉంది. దీని వెనక అశ్లీలత ఉందనో, వ్యాపార సంస్కృతి పెనవేసుకుని ఉందనో చాలా కాలంగా మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇవేవీ కాకుండా వివిధ కారణాలతో అందగత్తెలు వివాదాల్లో చిక్కుకొని కిరీటాలను వదులుకుంటున్న సంఘటనలు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది కిరీటాలు గెలుచుకోవడాన్ని మహిళా సాధికారతతో ముడిపెడతారు. కానీ సాధికారత మాట దేవుడెరుగు కనీసం భావవ్యక్తీకరణకు కూడా […]
దిశ, వెబ్‌డెస్క్ : అందాల పోటీలు అనగానే ఎక్కడో ఒక దగ్గర వివాదం రాజుకుంటూనే ఉంది. దీని వెనక అశ్లీలత ఉందనో, వ్యాపార సంస్కృతి పెనవేసుకుని ఉందనో చాలా కాలంగా మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇవేవీ కాకుండా వివిధ కారణాలతో అందగత్తెలు వివాదాల్లో చిక్కుకొని కిరీటాలను వదులుకుంటున్న సంఘటనలు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి.
చాలామంది కిరీటాలు గెలుచుకోవడాన్ని మహిళా సాధికారతతో ముడిపెడతారు. కానీ సాధికారత మాట దేవుడెరుగు కనీసం భావవ్యక్తీకరణకు కూడా చోటుండదని ఎన్నో ఉదారణలు మన కళ్లముందే ఉన్నాయి.
అమండా హన్నా అనే అమ్మాయి 2017లో ‘మిస్ లెబనాన్ ఎమిగ్రెంట్’ కిరీటాన్ని దక్కించుకుంది. కానీ వారం తిరగకముందే దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆమె చేసిన తప్పల్లా ఓసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి రావడమే. లెబనాన్‌కీ, ఇజ్రాయెల్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది అక్కడి యుద్ధ వాతావరణం. ఒకరిపైకి ఒకరు కాలు దువ్వుకుంటారు. ఓ అకాడమిక్ ట్రిప్‌లో భాగంగా తమ శతృదేశమైన ఇజ్రాయెల్ కు వెళ్ళిరావడంతో నిర్వాహకులు ఆమె టైటిల్‌ని వెనక్కి తీసుకున్నారు.
టర్కీలో అక్కడి యువత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా గళమెత్తుతున్నారు. 2016లో జరిగిన ఉద్యమంలో అనేకమంది పౌరులు మరణించారు. వారిని స్మరించుకుంటూ అనేకమంది నివాళ్లు అర్పించారు. మిస్ టర్కీ 2017 కిరీటాన్ని గెలుచుకున్న ‘ఇతిర్ ఇసేన్’ కు అదే పనిచేసింది. కాకపోతే కాస్త భిన్నంగా చేసింది. అదే ఆమె కిరీటం కోల్పోవడానికి కారణమైంది. కిరీటం గెలుచుకున్న ఆనందంలో “జూలై 15న అమరుల దినోత్సవం రోజున నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ రోజు అమరులైన వీరుల రక్తానికి సూచికగా ఈరోజు నేను రక్తాన్ని చిందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. చనిపోయిన “అమరవీరుల” రక్తాన్ని తన ఋతుచక్రంతో పోల్చుతూ ట్వీట్ చేయడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తున్నామని పోటీ నిర్వాహకులు తెలిపారు. కిరీటం గెలుచుకున్న ఆనందం కొద్ది గంటల్లో ఆవిరైపోయింది.
శాలీ గ్రీజ్ అనే అందగత్తెది సిల్లీ కారణంతో కిరీటాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆమె 2014లో మిస్ లెబనాన్ టైటిల్‌ని దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాదిలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లోనూ ఆమె పాల్గొంది. అక్కడ తన తోటి కంటెస్టెంట్ అయిన ‘మిస్ ఇజ్రాయెల్’తో కలిసి సెల్ఫీ దిగడంతో శాలీ చిక్కుల్లో పడింది. శతృదేశపు అందగత్తెతో సెల్ఫీ ఎలా దిగుతుంది అంటూ నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ శాలీ గ్రీజ్ తన ఫేస్‌బుక్‌లో వివరణ ఇస్తూ ‘నేను నిక్కార్సైన లెబనన్ వనితను. మొదట్నుంచీ మిస్ ఇజ్రాయెల్‌తో దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నా. కానీ నేను వేరే వాళ్లతో ఫొటో దిగుతుంటే ఉన్నట్టుండి ఆ అమ్మాయి వచ్చి మాతో సెల్ఫీ తీసుకుంది’ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
పక్క దేశామైన బొలివియాకు మద్దతు పలికిందని మిస్ చిలీ, దేశాధ్యక్షుడిపై ఒక వ్యంగ్యపదం సోషల్ మీడియాలో ఉపయోగించిదని మిస్ టర్కీ, భర్తతో విడాకులు తీసుకొని మిసెస్ పోటీలకు వచ్చిందని మిసెస్ శ్రీలంక, రోహింజ్యాలకు వ్యతిరేకంగా స్పందించిందని మిస్ గ్రాండ్ మయన్మార్ ఇలా ఒక్కరూ ఇద్దరిని కాదు పదుల సంఖ్యలో అందగత్తెలు తమ కిరీటాలను కోల్పోవాల్సి వచ్చింది.
మొదట్లో ఈ పోటీల్లో రాజకీయ జోక్యం, ఇతర అంశాలు పెద్దగా ఉండేవి కావు.. కానీ ఇప్పుడు అన్ని ఇందులోకి చొచ్చుకొచ్చాయి.