మరమగ్గాలే ఆయుధం కావాలి : కోదండరాం
దిశ, తెలంగాణ బ్యూరో : చేనేతలు వస్త్రాలను తయారు చేసే మరమగ్గాలు ఆయుధం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేతలకు వాటా దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చేనేత జాతీయ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తల అడగలేదని… కేవలం చేనేతకు సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే అడిగామన్నారు. ప్రత్యేక తెలంగాణ […]
దిశ, తెలంగాణ బ్యూరో : చేనేతలు వస్త్రాలను తయారు చేసే మరమగ్గాలు ఆయుధం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేతలకు వాటా దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చేనేత జాతీయ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తల అడగలేదని… కేవలం చేనేతకు సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే అడిగామన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చేనేత కార్మికులు సైతం భాగస్వాములయ్యారని, మరమగ్గంతో భాగస్వాములు అయ్యారన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా వాట మాకు దక్కాలని చేనేత కార్మికులు కోరడంలో తప్పులేదన్నారు. కొట్లాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు. కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నంత వరకే చేనేత గురించి మాట్లాడి తర్వాత విస్మరిస్తారన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ పథకాల గురించి మాట్లాడి మాటతప్పుతాడని ధ్వజమెత్తారు. చేనేత కార్మికుల ఉద్యమంలో టీజేఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు.
సబ్సిడీపై యారం, రంగులు కొనేటప్పుడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరమగ్గాలపై పనిచేసేవారికి జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీమాపథకం ప్రవేశపెట్టాలని, వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. టెక్స్ టైల్ పార్కులు పనిచేయడం లేదని చేనేత కార్మికులకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఎన్నికల కోసం పథకాలు కాకుండా ప్రజాసంక్షేమం కోసం కృషిచేయాలని కోరారు. సమస్యల సాధనకోసం నేతన్నలు చేపట్టే కార్యాచరణలో సీపీఐ భాగస్వామ్యం అవుతుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, కానీ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వస్తే ఏ సమస్య ఉండదనుకుంటే ఇంకా ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ప్రసూన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుదామన్నారు. టీడీపీ చేనేత కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆదుకుందని వెల్లడించారు.
వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర నాయకురాలు ఇందిరాశోభన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. గీతన్నలు, నేతన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురి కోసం నాలుగుకోట్ల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడుతూ చేనేత స్థితిగతుల అధ్యయనం కోసం కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవర్ లూమ్, చేనేతకు వేర్వేరు కార్పొరేషన్లు వేయాలని కోరారు. కాలానుగుణంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. చేనేత కార్మికులు హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.
చేనేతల జాతీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 7 వరకు చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఏడేళ్లలో 362 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. ప్రభుత్వం కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చేనేతల గురించి మాట్లాడుతుందని హామీలు గుప్పిస్తున్న అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేనేత చిత్తశుద్ధి లేదని నటిస్తుందని ధ్వజ మెత్తారు. మృతి చెందిన చేనేత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్దెనిమిదేళ్లు నిండిన చేనేత వరకు ప్రతి నెల 3000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు పార్టీలో చేరితే వారి వెంట చేనేత వర్గం రాదన్నారు. ప్రభుత్వం ప్రగల్బాలు కాకుండా చేనేత శ్రేయస్సుకోసం పనిచేయాలని కోరారు. గద్దె నెక్కించడం తెలుసు… గద్దె దించడం తెలుసునన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షం అని కాకుండా అందర్ని ప్రశ్నిస్తామన్నారు. రాట్నమే దిశానిర్దేశం చేస్తుందని స్పష్టం చేశారు.
చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాసికుంట లక్ష్మీనర్సయ్య, తెలంగాణ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ లు మాట్లాడుతూ ప్రభుత్వానికి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి లేదన్నారు. 1200ల కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.320 కోట్లు కేటాయించిందని, ఆ నిధులు తిరిగి బతుకమ్మ చీరలకే 312కోట్లు కేటాయించిందని ఆరోపించారు. చేనేత చేయూత పథకం ప్రవేశపెట్టి నిబంధనలు విధించడంతో చేనేత కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సహకార సంఘాలకు రుణమాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ నరహరి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం అధ్యాయనం చేసి తెలంగాణలో అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇన్ ఫుట్ సబ్సిడీలు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా పలువురు చేనేత సహకారసంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం, రాజు, దేవేందర్, చిక్క దేవదాసు, లక్ష్మీనర్సయ్య, నరేందర్, రేణుక, విజయలక్ష్మి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.