సైజ్‌ ప్లస్ దుస్తుల్లోనూ వివక్ష తప్పదా!

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. సన్నగా కరెంటు తీగలా, నాజూకుగా కనిపించాలనే కోరుకుంటారు. అయితే ముద్దబంతుల్లా ఉంటే తప్పేంటి? లావుగా, బొద్దుగా ఉంటే.. వాళ్లను ట్రీట్ చేసే విధానం మారిపోతుందా? అంత మాత్రాన వారిపై వివక్ష చూపిస్తారా? అంటే.. అవును సొసైటీలో అదే ధోరణి కొనసాగుతోంది. ప్లస్ సైజ్ ఉంటే చాలు వారిపై నానా కామెంట్లు చేస్తూ, సైజు గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. వారి తిండి గురించి కూడా చెత్త వాగుడు వాగుతుంటారు. ఇది […]

Update: 2020-11-10 02:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. సన్నగా కరెంటు తీగలా, నాజూకుగా కనిపించాలనే కోరుకుంటారు. అయితే ముద్దబంతుల్లా ఉంటే తప్పేంటి? లావుగా, బొద్దుగా ఉంటే.. వాళ్లను ట్రీట్ చేసే విధానం మారిపోతుందా? అంత మాత్రాన వారిపై వివక్ష చూపిస్తారా? అంటే.. అవును సొసైటీలో అదే ధోరణి కొనసాగుతోంది. ప్లస్ సైజ్ ఉంటే చాలు వారిపై నానా కామెంట్లు చేస్తూ, సైజు గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. వారి తిండి గురించి కూడా చెత్త వాగుడు వాగుతుంటారు. ఇది కేవలం కామెంట్లతోనే ఆగిపోవడం లేదు. వారి సైజ్ పరంగా ఎంపిక చేసుకునే వస్ర్తాల విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతోంది. ఇలాంటి ఫ్యాట్ ట్యాక్స్‌పై సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతుండటం గమనార్హం.

చిన్నప్పుడు ‘బొద్దు’గా ఉంటే ముద్దు చేస్తారు. కానీ అదే సైజ్ కంటిన్యూ చేస్తే ఆ ముద్దు చేసిన వారే.. కోప్పడుతుంటారు. ఈ విషయాన్ని ముఖం మీదే అనేసేవాళ్లు కొందరైతే, చాటున కామెంట్లు చేసేవాళ్లు మరికొందరు. ఎలా మాట్లాడినా వారి మనసు నొచ్చుకుంటుందని గ్రహించడం చాలా ముఖ్యం. అందరూ నాజుగ్గా ఉండలేరు. వారి వారి శరీర తత్వాలను బట్టి వెయిట్ పెరుగుతుంటారు. వారికి జరిగిన ఆపరేషన్లు, తీసుకునే మెడిసిన్స్, థైరాయిడ్ సమస్యలు, ఫుడ్ హ్యాబిట్స్ వంటి అనేక కారణాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అంతమాత్రాన వారి శరీరంపై కామెంట్ చేయడం సరికాదు. ఇక వస్త్రధారణ విషయానికొస్తే.. రెగ్యులర్ ఔట్ ఫిట్స్ ధర కంటే, ప్లస్ సైజ్ ధరలు కాస్త ఎక్కువే ఉంటాయి. అమెరికాలో దాదాపు 68 శాతం మంది మహిళలు 14 సైజ్, ఆపైన (14 ప్లస్) సైజుల్ని ఉపయోగిస్తున్నారు. వీటికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్లస్ సైజ్ వ్యక్తుల దుస్తుల విషయంలో ఇండియాలోనూ అధిక ధరలున్నాయి. డిజైనర్లు, బొటిక్స్, లోకల్ స్టోర్స్ యజమానులు ప్లస్ సైజ్‌పై ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ధోరణిని ప్రముఖ ఫ్యాషన్ క్రిటిక్ డైట్ సభ్య, ఐశ్వర్య సుబ్రహ్మణ్యం ఇన్‌స్టా వేదికగా వ్యతిరేకిస్తూ చర్చను కొనసాగిస్తున్నారు. ఎంతోమంది ప్లస్ సైజు బాధితుల అనుభవాలను తమ ఇన్‌స్టా స్టోరీలుగా పెడుతూ ప్లస్ సైజు వ్యక్తుల అంతరంగాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ స్టోరీలు చూసైనా కొందరైనా మారుతారని సభ్య, ఐశ్వర్యలు అభిప్రాయపడుతున్నారు.

ప్లస్ సైజ్‌కు క్లాతింగ్‌తో పాటు అందుకు సంబంధించిన మెటీరియల్స్ ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుందని, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే, అదనపు సమయం వెచ్చించాల్సి ఉంటుందని కొందరు డిజైనర్లు వాదిస్తున్నారు. అయితే మరి స్లిమ్ ఫిట్ వారికి తక్కువ మెటీరియల్ యూజ్ చేస్తారు కదా! అలాంటప్పుడు వారికి అదనపు డిస్కౌంట్లు ఇవ్వాలి కదా? అలా ఇవ్వలేనప్పుడు ప్లస్ సైజ్ మీద మాత్రం అదనపు డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎంబ్రాయిడరీ కోసం మెషిన్లను ఉపయోగిస్తారని, టైమ్ ఎందుకు వేస్ట్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు? బాడీ టైప్ ఆధారంగా ధర నిర్ణయించడం అన్‌ఫెయిర్ అని, క్రూయల్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

డైట్ సభ్య లేవనెత్తిన ‘ప్లస్ సైజ్’ అంశంపై చాలా మంది నెటిజన్లు తమ స్వీయ అనుభవాలను పంచుకున్నారు. ప్లస్ సైజ్ బట్టల కోసం బొటిక్స్, షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు ఆయా బొటిక్ యజమానులు, డిజైనర్లతో పాటు అక్కడ వర్క్ చేసే వర్కర్స్ తమను చాలా హర్ట్ చేసే విధంగా బిహేవ్ చేశారని చెప్పుకొచ్చారు. ‘వారి సైజులు మనదగ్గర దొరకవు.. వారికి అస్సలు ఏమీ చూపించకండి’ అంటూ ముఖం మీదే దుకాణాదారుల అన్నట్లు తెలిపారు. గౌరీ అండ్ నైనిక అనే ఇన్‌స్టా యూజర్ దీనిపై స్పందిస్తూ ‘మేము కూడా యూకే 16 సైజ్ మీద ఎక్స్‌ట్రా మనీ చార్జ్ చేసేవాళ్లం కానీ, సభ్య పెట్టిన ఇన్‌స్టా స్టోరీలను చూశాక, ఇక మీదట ప్లస్ సైజ్ క్లాతింగ్‌పై ఎలాంటి ఎక్స్‌ట్రా మనీ తీసుకోం’ అని వెల్లడించింది. ఇక మరో యూజర్ ‘నేను ఓ బొటిక్‌కు వెళ్లాను. అక్కడ వారు సూచించిన సైజ్ చార్ట్ కొలతల కంటే నేను కాస్త ఎక్కువగా బరువు ఉన్నాను. దాంతో నా లెహెంగాకు 60 వేల రూపాయలు ఎక్కువగా తీసుకున్నారు’ అని తెలిపింది.

కొన్ని దేశాల్లో షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ ప్రొడక్ట్స్‌పై అధిక ట్యాక్స్ విధిస్తారు. దాన్నే ‘ఫ్యాట్ టాక్స్’ అంటారు. ప్లస్ సైజ్ వ్యక్తులు ఇలాంటి ఫ్యాట్ ప్రొడక్ట్స్ ఎంచుకోకుండా కంట్రోల్ చేయడానికి ఇలా అధిక పన్నులు విధిస్తారు. అయితే ఈ కారణంగానే అమెరికాలో ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తుల ఏడాది ఖర్చు, మిగతా వారితో పోలిస్తే కొన్ని వేల డాలర్లు అదనంగా ఉంటుంది. దానికి కారణం ఫ్యాట్ ట్యాక్స్. క్లాతింగ్‌లోనూ ప్లస్ సైజ్ వ్యక్తుల విషయంలో అధికంగా డబ్బులు వసూలు చేయడం, ఎక్కువ ప్రైస్ ట్యాగ్‌లు పెడుతున్నారు. దీన్ని కూడా ‘ఫ్యాట్ ట్యాక్స్’గా పేర్కొంటున్నారు.

లావుగా ఉండటం వారి తప్పు కాదు. మనం వారిని చూసే దృష్టి కోణం మారాలి. ఎదుటివాళ్లు లావుగా ఉంటే మనకు వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి? అని ముందు మనకు మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. మరి డైట్ సభ్య చేస్తున్న ఈ కృషి వల్లనైనా రాబోయే రోజుల్లో ‘ఫ్యాట్ ట్యాక్స్’ తొలిగించి అందరినీ సమానంగా చూసే రోజులు వస్తాయని ఆశిద్దాం.

Tags:    

Similar News