ఫైర్ సేఫ్టీ నిల్.. పర్మిషన్ రద్దు

దిశ, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు రద్దు చేసిన 68 జూనియర్ కళాశాలల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు వీటికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం మీద 68 కళాశాలల గుర్తింపు రద్దు కాగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కళాశాలలే ఎక్కువగా ఉన్నాయి. రానున్న విద్యా సంవత్సరం 2020-21 […]

Update: 2020-04-18 07:49 GMT

దిశ, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు రద్దు చేసిన 68 జూనియర్ కళాశాలల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జూనియర్ కళాశాలలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు వీటికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం మీద 68 కళాశాలల గుర్తింపు రద్దు కాగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కళాశాలలే ఎక్కువగా ఉన్నాయి. రానున్న విద్యా సంవత్సరం 2020-21 నుంచి ఈ కళాశాలలు మూతపడనున్నాయి. ఇప్పటికే ఈ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని సెకండ్ ఇయర్‌లోకి అడుగుపెట్టే విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హైకోర్టు ఆదేశం మేరకు బోర్డు తీసుకున్న నిర్ణయం అనంతరం ఇంటర్ కళశాలలు పర్యవేక్షణ చేసే డీఐఈవో అధికారులకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు.

ఫైర్ సేఫ్టీ నిల్..

రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కళాశాలలు చాలా కాలంగా నడుస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కు అవుతున్నందు వల్లనే ఇవి యథేచ్ఛగా పనిచేస్తున్నాయన్నది విద్యార్థుల, వారి తల్లిదండ్రుల వాదన. నిజానికి నిబంధనలకు అనుగుణంగా కళాశాలల నిర్వహణ లేకున్నా అధికారులు చూసీ, చూడనట్టుగా వదిలేస్తున్నారు. దీంతో ప్రైవేటు కళాశాలలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నివాస ప్రాంతాల్లోనే కళాశాలలు నడుస్తున్నాయి. ఇరుకు గదులతోనే నడిపిస్తున్నాయి. అనుమతి ఒక ఏరియాలో తీసుకుని కళాశాలను మరో ప్రాంతంలో నడుపుతున్నాయి యాజమాన్యాలు. అనేక అంశాల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తున్నాయి. ఈ నిబంధనల్లో ఫైర్ సేఫ్టీ అనుమతి కూడా ఒకటి. నిబంధనల ప్రకారం కళాశాల భవనం ఎత్తు 15 మీటర్లకు మించితే అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర సర్టిపికెట్ (ఎన్ఓసి) తీసుకోవాలి. పైర్ సేఫ్టీ వ్యవస్థను నెలకొల్పాలి. కానీ అగ్నిమాపక శాఖ అనుతులు లేకుండానే జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇంటర్ బోర్డు రంగంలోకి దిగి కాలేజీల గుర్తింపును రద్దు చేసింది.

గ్రేటర్ లోనే 62 కళాశాలలు

నగరంలోని నారాయణగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, శామీర్‌పేట, తార్నాక, హబ్సీగూడ, ఎల్‌బీ‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయివేటు కళాశాలలదే హవా. హైకోర్టు రద్దు చేసిన వాటిలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 23, మేడ్చల్ జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాల్లో 12 చొప్పున జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 62 ఉన్నాయి. వీటిలో నారాయణ 28, శ్రీ చైతన్య 20, శ్రీ గాయత్రి 7, ఇతర యాజమాన్యాలకు చెందినవి ఏడు చొప్పున ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో నారాయణ 13, శ్రీ చైతన్య 6, శ్రీ గాయత్రి 2, ఇతరులు 2, మేడ్చల్ జిల్లాలో నారాయణ 12, శ్రీ చైతన్య 6, శ్రీ గాయత్రి 4, ఎన్ఆర్ఐ 4, లియో 1, రంగారెడ్డి జిల్లాలో నారాయణ 3, శ్రీ చైతన్య 8, శ్రీ గాయత్రి 1 కళాశాలలు ఉన్నాయి.

వాస్తవానికి ఈ కళాశాలలకు ఫైర్ సేఫ్టీ అనుమతుల కోసం ఇంటర్ బోర్డు గతంలో రెండు సార్లు అవకాశం కల్పించింది. కానీ, ఆ సమయంలో ఆరు నెలల్లో ఫైర్ సేఫ్టీ అనుమతులు తీసుకొస్తామని డిక్లరేషన్ కూడా బోర్డుకు సమర్పించాయి. ఇంటర్ బోర్డు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఈ కళాశాలలకు ఫైర్ అనుమతులు రాలేదు. అనుమతుల్లేని కళాశాలలను రద్దు చేయాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు వీటిని రద్దు చేసింది.

tags: Inter Board, With Out Permission, Narayana-Sri Chaitanya, Junior Colleges Closed High Court Judgment

Tags:    

Similar News