వాట్ నెక్ట్స్.. ఉత్తమ్ అడుగులు అటువైపేనా?
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనగానే టీపీసీసీ చీఫ్ అనే పదమే గుర్తొస్తుంటుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏకంగా ఆరేండ్ల పాటు టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి ఇటీవల రేవంత్ నియామక ప్రకటన వరకు టీపీసీసీగా ఆయనే కొనసాగుతూ వచ్చారు. వాస్తవానికి ఎప్పటినుంచో టీపీసీసీ చీఫ్ మార్పు చేయాలనే ప్రతిపాదన వచ్చినా.. రెండేండ్ల కాలానికి పైగా […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనగానే టీపీసీసీ చీఫ్ అనే పదమే గుర్తొస్తుంటుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏకంగా ఆరేండ్ల పాటు టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి ఇటీవల రేవంత్ నియామక ప్రకటన వరకు టీపీసీసీగా ఆయనే కొనసాగుతూ వచ్చారు. వాస్తవానికి ఎప్పటినుంచో టీపీసీసీ చీఫ్ మార్పు చేయాలనే ప్రతిపాదన వచ్చినా.. రెండేండ్ల కాలానికి పైగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ తాజాగా కొత్త టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం కావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ఏ కమిటీల్లోనూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేకపోవడంతో.. నెక్ట్స్ ఉత్తమ్ స్టెప్ ఏంటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉత్తమ్ ఏ స్టెప్ తీసుకోనున్నారు..? పైకి ఓకే చెబుతున్నా.. రేవంత్‌కు పూర్తిగా సహకరిస్తారా..? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రెండు నియోజకవర్గాలు కోల్పోయి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు ఉత్తమ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘకాలంగా హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. పక్క నియోజకవర్గమైన కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి పోటీ చేసి ఓడిపోగా.. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ గెలిచారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ విజయం సాధించడంతో.. హుజూర్‌నగర్ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. అక్కడి నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి పోటీలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చేతిలో ఓడిపోవయారు. దీంతో ఉత్తమ్ చేతుల్లో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను చేతులారా వదులకున్నట్లయింది. ఒకవైపు టీపీసీసీ పదవి లేకపోవడం, మరోవైపు రెండు నియోజకవర్గాలు చేజారిపోవడంతో భవిష్యత్తులో ఉత్తమ్ ఎటువైపు అడుగులు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏ అసెంబ్లీ స్థానం ఎంచుకుంటారో..?
ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేంద్ర రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి ఎక్కువ. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. అయితే ఒకప్పుడు ఉత్తమ్‌కు కంచుకోటగా ఉన్న కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆయన బలం తగ్గింది. దీంతో ఉత్తమ్ కొత్త నియోజకవర్గం ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో మిర్యాలగూడ నియోజకవర్గం వైపు ఉత్తమ్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. అదే సమయంలో పాత నియోజకవర్గం నుంచే పోటీ చేసి పునర్వైభవం సాధిస్తారని ఉత్తమ్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఉత్తమ్ ఏ నియోజకవర్గం దిశగా పయనిస్తారో వేచి చూడాల్సిందే.