మీకు తెలియకుండానే పోర్న్ వీడియోల్లో నటిస్తారు..? ఎలాగో తెలుసా?

దిశ, ఫీచర్స్: కళ్లతో చూసింది, చెవులతో విన్నది నిజమేనంటారా? కొన్నిసార్లు నిజం కావచ్చు, మరికొన్ని సార్లు కాకపోవచ్చు. కానీ ఇంటర్నెట్ ఇచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ‘ఫేక్’ ఫొటోలను, వీడియోలను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో ‘మార్ఫింగ్ ఫొటోలు’ ఎందరి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో తెలిసిందే. పాండమిక్ వంటి కష్టసమయాల్లోనూ ‘ఫేక్’ న్యూస్ ఏదో, రియల్ ఏదో తేల్చుకోలేకపోయాం. ఇక ప్రస్తుతం ‘డీప్‌ఫేక్‌’లు సోషల్ మీడియాలో మరింత ప్రమాదకరంగా మారాయి. […]

Update: 2021-03-29 22:46 GMT

దిశ, ఫీచర్స్: కళ్లతో చూసింది, చెవులతో విన్నది నిజమేనంటారా? కొన్నిసార్లు నిజం కావచ్చు, మరికొన్ని సార్లు కాకపోవచ్చు. కానీ ఇంటర్నెట్ ఇచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ‘ఫేక్’ ఫొటోలను, వీడియోలను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో ‘మార్ఫింగ్ ఫొటోలు’ ఎందరి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో తెలిసిందే. పాండమిక్ వంటి కష్టసమయాల్లోనూ ‘ఫేక్’ న్యూస్ ఏదో, రియల్ ఏదో తేల్చుకోలేకపోయాం. ఇక ప్రస్తుతం ‘డీప్‌ఫేక్‌’లు సోషల్ మీడియాలో మరింత ప్రమాదకరంగా మారాయి. ఇందులో ‘మ్యానిపులేషన్’ పరిపూర్ణంగా ఉండగా, రియల్ వీడియోను, నకిలీ వాటిని గుర్తించడం కష్టతరం. ప్రస్తుత కాలంలో ఓ సెలబ్రిటీ, దేశ నాయకుడిని బెదిరించడానికి ‘డీప్ ఫేక్’ వీడియోలను మించిన ఆయుధం లేదంటే అతిశయోక్తి కాదేమో. అసలు డీప్ ఫేక్ వీడియోల వల్ల కలిగే నష్టాలేంటీ? వాటి వల్ల ఏం జరుగుతుంది? అనే అంశాలపై స్పెషల్ స్టోరీ.

ఏంటీ డీప్‌ఫేక్..

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకు రావడం సహజం. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే ఆ ప్రభావం సమాజం మీద తప్పకపడుతుంది. అందుకు తాజా నిదర్శనం ‘డీప్‌ఫేక్’. ఇటీవల కాలంలో ‘డీప్‌ఫేక్’ సృష్టిస్తున్న మాయాజాలంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ‘ఫేక్’ సమస్యలు ఎదుర్కొన్నవాళ్లే. అయితే వాటిని చూస్తే..గుర్తుపట్టొచ్చు కానీ ‘డీప్‌ఫేక్’‌ను నకిలీ అంటే నమ్మడం కష్టం. గత కొద్దికాలంగా సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, బిజినెస్ టైకూన్స్‌కు ‘డీప్‌ఫేక్’ తలనొప్పులు మొదలయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా కంప్యూటర్‌‌లో రూపొందించిన వీడియోలను ‘డీప్‌ఫేక్’ అంటారు. వాటిని ఫొటోల ద్వారా రూపొందిస్తుండగా, ఈ సాంకేతిక సాయంతో మనం ఎవరి వీడియోనైనా, ఫోటోనైనా మనకు నచ్చినట్లు మార్చేయొచ్చు. ఇవి నకిలీ కంటెంట్‌ను కలిగి ఉండగా, ఎక్కువగా వీడియోల రూపంలో ఉంటాయి. ఫొటోలు, ఆడియో వంటి ఇతర మీడియా ఫార్మాట్‌లు కూడా ఈ సాంకేతికత ఆధారంగా సృష్టించొచ్చు.

గుర్తించడం కష్టమేనా..?

ఒక వీడియోని ‘డీప్‌ఫేక్’తో మార్ఫ్‌ చేస్తే, దాన్ని గుర్తించడం కష్టమే. కానీ సైబర్‌ ఫోరెన్సిక్‌ విభాగంలో ఫ్రేమ్‌ల హిస్టోగ్రామ్‌లను కొన్ని ప్రత్యేకమైన టూల్స్‌ సహాయంతో విశ్లేషించడం ద్వారా నకిలీ వీడియోను గుర్తించొచ్చు. అయితే ఇదంతా జరిగే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఉదాహరణకు ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఓ మహిళ అప్‌లోడ్‌ చేసిన వీడియోను డౌన్‌లోడ్‌ చేసి ఆమె అశ్లీల చిత్రంలో నటించినట్లు ఏ మాత్రం అనుమానం రాకుండా వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనుకుందాం. అది ఫేక్ వీడియో అని గుర్తు పట్టేలోపే అది వైరల్ అవుతుంది. ఇక ఓ కుర్రాడు.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ పేరుతో ‘డీప్ టామ్ క్రుయిజ్’ అనే ట్విట్టర్ అకౌంట్ తెరిచాడు. అందులో డీప్‌ఫేక్స్‌తో వీడియోలు చేసి పెట్టేవాడు. దాంతో అది నిజంగా టామ్‌దేనని భావించిన నెటిజన్లు లక్షల్లో అతడిని ఫాలో అవడం మొదలుపెట్టారు. అంతేకాదు రాజకీయ నాయకులను చెడుగా చిత్రీంచడానికి అతడి వీడియోలను ‘డీప్‌ఫేక్’ ద్వారా రూపొందించి నెట్‌లో ట్రెండ్ చేయొచ్చు. ఇప్పటికే డీప్‌ఫేక్ దెబ్బకి బ్రిటీష్, అమెరికన్ నటీమణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఏ సంబంధం లేకున్నా వాళ్ల వీడియోలు పోర్న్ సైట్స్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే వీడియో వైరల్ కాగా, అది ఫేక్ వీడియో అని తేలిపోయింది. ఈ టెక్నాలజీ వల్ల కొంతలో కొంత ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే చారిత్రక ప్రముఖుల వీడియోలు రూపొందించొచ్చు. చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు తయారు చేశారు.

మహిళలకు అతి పెద్ద శత్రువే..

‘డీప్‌ఫేక్’‌ రూపొందించడానికి ఎంపిక చేసుకున్న ఫలానా వ్యక్తి స్వరంతో పాటు ముఖ కవలికలు కూడా అచ్చుగుద్దినట్లు ఉంటాయి. డీప్‌ఫేక్ వీడియోల విస్తరణతో ఇవి రాజకీయ నాయకులకు వెపన్స్‌గా మారుతున్నాయి. ఒకరి మీద మరొకరు బురద జల్లేందుకు, ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ వీడియోలను ఉపయోగించుకుంటున్నారు. ఇక ఈ డీప్‌ఫేక్‌ల వల్ల మరో పెద్ద ముప్పు పోర్న్ వీడియోలు. మహిళలను వేధించడానికి ప్రేమికులు ప్రతీకారం తీర్చుకోవడానికి డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలు లభ్యమవుతుంటాయి. వాటి ఆధారంగా అశ్లీలమైన ‘డీప్‌ఫేక్’ క్రియేట్ చేస్తే, వారి జీవితం నాశనమవుతుందన్నది కాదనలేని సత్యం.

డీప్‌ఫేక్‌పై నిషేధం సాధ్యమేనా..?

ఆయా కారణాల వల్లే చాలా దేశాలు ఈ ‘డీప్‌ఫేక్’‌కు సంబంధించిన యాప్‌లను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుండగా, ఒకరి అంగీకారం లేకుండా డీప్‌ఫేక్ వీడియోను రూపొందించడం చట్టవిరుద్ధంగా చేయాలనే ప్రతిపాదనను బ్రిటన్ లా కమిషన్ పరిశీలిస్తోంది. డీప్‌ఫేక్ డిటెక్టర్ నిర్మించడానికి ఫేస్‌బుక్.. బర్కిలీ, ఆక్స్‌ఫర్డ్ ఇతర ప్రముఖ సంస్థల నుంచి పరిశోధకులను నియమించింది. 2019లో ఇండస్ట్రీ లీడర్స్, విద్యా నిపుణుల భాగస్వామ్యంతో డీప్‌ఫేక్ డిటెక్షన్ చాలెంజ్‌ను నిర్వహించగా, 1 లక్ష కంటే ఎక్కువ వీడియోలతో కూడిన ప్రత్యేకమైన డేటాసెట్ సృష్టించారు. ఏదేమైనా, అన్ని డీప్‌ఫేక్‌లను ఖచ్చితంగా గుర్తించలేం. కాగా వాటిని కనుగొని తీసివేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంతేకాక, చాలా అశ్లీల సైట్లు ఒకే స్థాయి పరిమితులను అమలు చేయవు.

అణ్వాయుధాల కంటే ప్రమాదకరం

ప్రజాస్వామ్యంలో యుద్ధాలు చేయడంలో ‘డీప్‌ఫేక్’ అణ్వాయుధాల వలె శక్తిమంతమైనవి. పాత రోజుల్లో యునైటెడ్ స్టేట్స్‌ను బెదిరించాలనుకుంటే..10 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అణ్వాయుధాలు, లాంగ్ రేంజ్ మిసైల్స్ అవసరం. కానీ ఈ రోజుల్లో అవేమీ అవసరం లేదు. ఎన్నికలను అణగదొక్కగల, దేశాన్ని చిక్కుల్లోకి నెట్టగల వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియోను ఉత్పత్తి చేస్తే చాలు. అదే దేశాన్ని అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసి, బలహీనపరుస్తుంది.
– రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో

Tags:    

Similar News