ఎఫ్ఐఆర్‌లో కేటీఆర్ పేరు ఎందుకు పెట్టలేదు?

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది సెప్టెంబరు 17వ తేదీన కురిసిన వర్షానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి నాలాలో పడిపోయి చనిపోయిన చిన్నారి సుమేధ సంఘటనకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ మొదలు స్థానిక కార్పొరేటర్, ఇంజనీరింగ్ సిబ్బంది వరకు అందరూ బాధ్యలేనని, వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదని మృతురాలి తల్లి సుకన్య దాఖలు చేసిన ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. నేరెడ్‌మెట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు సుకన్య సెప్టెంబరు 21వ తేదీన […]

Update: 2021-01-10 12:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గతేడాది సెప్టెంబరు 17వ తేదీన కురిసిన వర్షానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి నాలాలో పడిపోయి చనిపోయిన చిన్నారి సుమేధ సంఘటనకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ మొదలు స్థానిక కార్పొరేటర్, ఇంజనీరింగ్ సిబ్బంది వరకు అందరూ బాధ్యలేనని, వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదని మృతురాలి తల్లి సుకన్య దాఖలు చేసిన ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. నేరెడ్‌మెట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు సుకన్య సెప్టెంబరు 21వ తేదీన ఫిర్యాదు చేసి ఈ సంఘటనలో పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్‌లో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జోనల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, నేరెడ్‌మెట్ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ స్టాఫ్, మల్కాజిగిరి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ స్టాఫ్ తదితరులంతా బాధ్యులేనని పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లను పెట్టారో లేదో తెలుసుకోడానికి న్యాయవాది మామిడి వేణుమాధవ్ గవర్నర్‌ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద సెప్టెంబరు 26వ తేదీన దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన రాజ్‌భవన్ పౌర సమాచార అధికారి (సహాయ కార్యదర్శి) నవంబరు 7వ తేదీన రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. వేణుమాధవ్ దరఖాస్తును కూడా జతచేశారు. బాధితురాలి తల్లి సెప్టెంబరు 21న చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నవారి పేర్లన్నింటినీ ఎఫ్ఐఆర్‌లో నేరెడ్‌మెట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో పాటు ఆమె ఫిర్యాదును కూడా జతచేశారు. వీటిలో పేర్కొన్న అంశాలు సహేతుకమైనవేనని, తగిన చర్యలు తీసుకోడానికి సమంజసమైనవేనని డీజీపీకి పంపిన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు సమాచార హక్కు చట్టం కింద వేణుమాధవ్ చేసిన దరఖాస్తుకు రాజ్‌భవన్ పౌర సమాచార అధికారి నవంబరు 9వ తేదీన జవాబు ఇచ్చారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి స్పష్టం చేసినట్లు రాసిన లేఖను కూడా జతచేశారు. డీజీపీకి రాజ్‌భవన్ నుంచి వెళ్ళిన లేఖకు కొనసాగింపుగా కుషాయిగూడ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి) నేరెడ్‌మెట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు డిసెంబరు 21న లేఖ రాశారు.

రాజ్‌భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్ళిన లేఖ విషయాన్ని, సమాచార హక్కు చట్టం కింద వేణుమాధవ్ దాఖలు చేసిన దరఖాస్తు విషయాన్ని ప్రస్తావించి తగిన లీగల్ సలహా తీసుకుని నేరుగా దరఖాస్తుదారునికే వివరాలు అందజేయాలని సూచించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ మొదలు ఇంజనీరింగ్ స్టాఫ్ వరకు ఎఫ్ఐఆర్‌లో పేర్లు ఎందుకు నమోదు చేయలేదో లీగల్ సలహా అనంతరం దరఖాస్తుదారునికి తెలియజేయాలని స్పష్టం చేశారు.

తన కుమార్తె నాలాలో పడి చనిపోవడానికి మంత్రి మొదలు ఇంజనీర్ వరకు అందరూ బాధ్యులేనని, బాధ్యత ప్రకారం వారు కర్తవ్యాన్ని నిర్వహించి ఉంటే నాలాలు బాగుపడి ఉండేవని, చిన్నారి అందులో పడి చనిపోయే పరిస్థితి వచ్చేది కాదని సుకన్య తన ఫిర్యాదులో వివరించారు. అనేకసార్లు నాలాల నిర్వహణ గురించి ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని, గతంలో ఒక గర్భిణీ కూడా నాలాలో పడ్డారని, వెంటనే స్పందించడంతో ప్రాణాలతో బైటపడ్డారని ఆమె ఆ ఫిర్యాదులో గుర్తుచేశారు.

గవర్నర్ కార్యాలయం మొదలు డీజీపీ వరకు ఈ ఫిర్యాదుపై స్పందించినందున నేరెడ్‌మెట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లీగల్ ఒపినియన్‌లో వచ్చే అభిప్రాయం మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్పందించే అవకాశం ఉంది.

Tags:    

Similar News