ఇంకా తెరుచుకోని సినిమా థియేటర్లు.. లాక్‌డౌనే అడ్డంకినా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై పడింది. దీని వల్ల ఎందరో నష్టపోయారు. అదే బాటలో ఎందరికో వినోదాన్ని పంచిన థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు భారీగా నష్టపోయారు. ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దాదాపు ఎనిమిదిన్నర నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నా.. సరిగ్గా రెండున్నర నెలలకే సెకండ్ వేవ్ కారణంగా తిరిగి మూతపడాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్వం సెకండ్ వేవ్ కు కూడా స్వస్తి చెప్పి లాక్‌డౌన్ ఆంక్షలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై పడింది. దీని వల్ల ఎందరో నష్టపోయారు. అదే బాటలో ఎందరికో వినోదాన్ని పంచిన థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు భారీగా నష్టపోయారు. ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దాదాపు ఎనిమిదిన్నర నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నా.. సరిగ్గా రెండున్నర నెలలకే సెకండ్ వేవ్ కారణంగా తిరిగి మూతపడాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్వం సెకండ్ వేవ్ కు కూడా స్వస్తి చెప్పి లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసినా ఎక్కడా ఒక్క తెర కూడా తెరుచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిగా లాక్ డౌన్ ఎత్తివేస్తేనే కానీ బొమ్మ పడేలా కనిపించడంలేదు. తెలంగాణలో థియేటర్లు ప్రారంభిస్తే నిర్మాతలు, బయ్యర్లు నష్టపోయే అవకాశముంది. ఏపీలో ఈ నెల చివరి వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో థియేటర్లు ఓపెన్ అవ్వడానికి మరో రెండు వారాల సమయం పట్టేలా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ అడ్డంకి..
తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 550 థియేటర్లు ఉండగా అందులో 400 సింగిల్ స్క్రీన్ సినిమాహాళ్లు, 150 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఈ 550 థియేటర్లలో ఒక్కటి కూడా తెరుచుకోలేదు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఉండటం కూడా అడ్డంకిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. అయితే తెలంగాణలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తే బయ్యర్లు, నిర్మాతలకు భారీగా నష్టపోయే అవకాశం ఉండటంతో ఏపీలో లాక్ డౌన్ తొలగిపోయాక బొమ్మ ప్రదర్శించాలనే ఆలోచనలో థియేటర్ల యజమానులున్నారు. అలా అయితేనే ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమకు కొంత ఊరట లభించే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
రిలీజ్‌కు సినిమాలు సిద్ధంగా ఉన్నా.. వెనుకంజ
కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ అనంతరం పలు పెద్ద సినిమాలు మిగిలిపోయిన చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైన సమయంలోనే సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది. దీంతో రిలీజ్ తేదీలను సైతం ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. చిరంజీవి ఆచార్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ, టక్ జగదీశ్, విజయ్ దేవరకొండ నటించిన లైగర్, కేజీఎఫ్ 2, లవ్ స్టోరీ, విరాటపర్వం, సీటీమార్, ఖిలాడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి బడా సినిమాలతో పాటు పుష్పక విమానం, రాజ రాజ చోర, రిపబ్లిక్, వరుణతేజ్ నటించిన గని వంటి సినిమాలన్నీ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.
చిన్న థియేటర్ల యజమానులకే ఇబ్బందులు
మల్టీఫ్లెక్స్‌లు కలిగి ఉన్నవారు సంపన్నులు కాబట్టి ఎలాగైనా ఈ నష్టాన్ని నెట్టుకురాగలరు. అయితే చిన్ని థియేటర్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ అంశమై థియేటర్ల యజమానుల సంఘం చర్చలు జరిపి తమ సమస్యలను మూకుమ్మడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు రాయితీలు కల్పించాలని కోరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మినిమం డిమాండ్ చార్జీలను మాఫీ చేయాలని దాదాపు 15 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. తెలంగాణలోని 550 థియేటర్లలో 300 థియేటర్లు నడపగలరు. కానీ మిగిలిన 150 సినిమాహాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉండటంతో అంతా ఏకమయ్యారు. ఫస్ట్ వేవ్ అనంతరం లాక్ డౌన్ ఎత్తేసిన సమయంలోనూ మినిమం డిమాండ్ చార్జీల నేపథ్యంలో దాదాపు 50 థియేటర్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని పలు ఫేమస్ థియేటర్లు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాదాపు మూడు వారాలకు కానీ తెరుచుకోలేదు.
దర్శనమిస్తున్న ‘క్లోజ్ డ్’ బోర్డులు
ఫస్ట్ వేవ్ అనంతరం దాదాపు ఎనిమిదిన్నర నెలలకు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో జనం బాగానే ఆదరించారు. జాగ్రత్తలు పాటించి సినిమాహాళ్లకు వెళ్లారు. ఉప్పెన, జాతిరత్నాలు వంటి చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టాయి. క్రాక్, రెడ్, మాస్టర్, వకీల్ సాబ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా అలరించాయి. అయితే సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు ఓపెన్ అయ్యాయని ఔత్సాహకులు థియేటర్లకు వెళ్తే ‘థియేటర్ క్లోజ్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. యాజమాన్యాలు అలా చేయడంపై ప్రేక్షకులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులకు సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నట్లు భరోసా కల్పిస్తే తిరిగి జనం ఆదరిస్తారనే నమ్మకం తమకుందని యజమానులు చెబుతున్నారు.
మినిమం డిమాండ్ చార్జీలు మాఫీ చేయాలి
సినిమాహాళ్లలో షోలు ఆడినా, షోలు నిర్వహించకున్నా ఒక్కో థియేటర్‌కు నెలకు రూ.50 వేలకు పైగానే ఖర్చు వస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా మినిమం డిమాండ్ చార్జీల పేరిట విద్యుత్ శాఖకు పన్ను చెల్లిస్తున్నట్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో తమకు నెలకు రూ.8 వేల వరకు విద్యుత్ బిల్లు వచ్చినా కచ్చితంగా మినిమం డిమాండ్ చార్జీలు చెల్లించాలని కోరడమేంటని యజమానులు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోవడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఈ చార్జీలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాని వల్ల ఆర్థిక నష్టాల నుంచి తమకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని చెబుతున్నారు.
ఈ మొత్తం కూడా రూ.2 కోట్ల వరకు ఉంటుందని యజమానులంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ సంస్థల సీఎండీలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని ఇంకా పెండింగ్ లోనే ఉంచినట్లు వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల లోపు పూర్తయ్యే చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పిస్తామన్నా.. అది కూడా పెండింగ్ లోనే ఉంది.