కరోనా కట్టడిలో ధారావి ఆదర్శం: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: కరోనా కట్టడి చేసిన మహారాష్ట్రలోని అతిపెద్ద మురికివాడ ధారావి ప్రపంచానికి ఆదర్శమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కట్టడి సాధ్యమేనని తెలిపింది. గత ఆరువారాల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపయ్యాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ కట్టడి సాధ్యమేనని విశ్వాసాన్ని ప్రకటించారు. కరోనా తీవ్రంగా విజృంభించిన ప్రాంతాలూ ప్రభావవంతంగా కట్టడి చేసిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూడొచ్చని తెలిపారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా సహా జనసమ్మర్ధం […]
జెనీవా: కరోనా కట్టడి చేసిన మహారాష్ట్రలోని అతిపెద్ద మురికివాడ ధారావి ప్రపంచానికి ఆదర్శమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కట్టడి సాధ్యమేనని తెలిపింది. గత ఆరువారాల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపయ్యాయని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ కట్టడి సాధ్యమేనని విశ్వాసాన్ని ప్రకటించారు. కరోనా తీవ్రంగా విజృంభించిన ప్రాంతాలూ ప్రభావవంతంగా కట్టడి చేసిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూడొచ్చని తెలిపారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా సహా జనసమ్మర్ధం అధికంగా ఉండే ముంబయి మెగా సిటీలోని ధారావిలోనూ కరోనాను కఠిన నిబంధనలతో కట్టడి చేశారని వివరించారు. సామాజిక వ్యాప్తి జరగకుండా అప్రమత్తమై జ్వర పీడుతులైన ప్రతి ఒక్కరికీ టెస్టులు, ట్రేసింగ్, ఐసొలేటింగ్, ట్రీట్‌మెంట్ ద్వారా వైరస్ శృంకలాలను తెంచేశారని, మహమ్మారిని నులిమేశారని తెలిపారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు పెద్దమొత్తంలో నమోదవుతున్నాయని, మరికొన్ని దేశాల్లో ఆంక్షల సడలింపులతో మళ్లీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, పటిష్ట చర్యలతో కరోనాను కట్టడి చేయడం సాధ్యమేనని వివరించారు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు, సామాజిక దూరం పాటించడం అసాధ్యమనిపించే రీతిలో జీవన విధానముండే ధారావిలో వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపించినప్పుడు వైద్య నిపుణులు, ప్రభుత్వమూ ఆందోళనకు లోనైంది. కానీ, కఠిన కట్టడి నిబంధనలను పాటించి మహమ్మారి తల వంచి ఇప్పుడు ఆ మురికివాడ ధారావి ప్రపంచానికే ఆదర్శంగా మారింది.