అప్పులు తీర్చడానికి రాష్ట్రాన్ని అమ్మేస్తారేమో : విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్కారు చేసే అప్పులు తీర్చడానికి రాష్ట్రం మొత్తాన్నీ అమ్మేస్తారేమోనని భయంగా ఉందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో కుప్పకూలి అప్పులపాలైన జీహెచ్ఎంసీయే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఒకప్పుడు నిధులతో కళకళలాడిన ఈ హైదరాబాద్ నగర పాలక సంస్థ నేడు సొంత ఉద్యోగులకు సైతం జీతాలివ్వలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేక […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్కారు చేసే అప్పులు తీర్చడానికి రాష్ట్రం మొత్తాన్నీ అమ్మేస్తారేమోనని భయంగా ఉందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో కుప్పకూలి అప్పులపాలైన జీహెచ్ఎంసీయే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఒకప్పుడు నిధులతో కళకళలాడిన ఈ హైదరాబాద్ నగర పాలక సంస్థ నేడు సొంత ఉద్యోగులకు సైతం జీతాలివ్వలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేక నానా పాట్లు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ నుంచి బిల్లులు వస్తాయని నమ్మి… అప్పులు చేసి మరీ పనులు చేస్తున్నవారిని సైతం నట్టేట ముంచే పరిస్థితి దాపురించిందన్నారు. ఐదేళ్ల క్రితం మిగులు నిధులతో ఉన్న జీహెచ్ఎంసీ… నేడున్న దయనీయస్థితిపై ఈ మధ్య కాలంలో మీడియా కథనాలు వెలువడ్డాయన్నారు. ఇంత జరుగుతున్నా అధికార పక్షానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం పౌరులు చేసుకున్న దురదృష్టం అని విచారం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీపై అదనపు భారం మోపి అందుకు అవసరమైన నిధులు ఇవ్వకపోవడం… అవినీతిపరులను అడ్డుకోలేకపోవడం… వివిధ పన్నుల్లో అందాల్సిన వాటా విడుదల చేయకపోవడం… కోట్లాది రూపాయలతో ఉన్నతాధికారుల వృథా ఖర్చులు… ఇలా ఒకదాని మీద ఒకటి జీహెచ్ఎంసీని కుంగదీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టులకు అప్పులివ్వాలంటేనే ఆర్థిక సంస్థలు వణికిపోతున్నాయని, ఇదీ అధికార పార్టీ నిర్వాకమేనని ఆరోపించారు.
‘మనందరం చిన్నప్పుడు బంగారు గుడ్లు పెట్టే ఒక బాతును ఇంకా ఎక్కువ గుడ్ల కోసం దురాశతో చంపేసిన ఒక మనిషి కథ చదువుకున్నాం. అలాంటి మనిషిని ఇప్పుడు కళ్లారా చూడాలనుకుంటే… అందుకు నిలువెత్తు ఉదాహరణగా కనిపించే ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్’అని విజయశాంతి పేర్కొన్నారు.