హౌసింగ్ మంత్రి ఇలాకాలో.. డబుల్ ఇండ్ల ప్రవేశాలు ఎప్పుడో..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిలో, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు చేస్తుండటంతో నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పక్కా ఇండ్లను రూ.5 […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిలో, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలు చేస్తుండటంతో నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పక్కా ఇండ్లను రూ.5 లక్షలతో కట్టి ఇస్తామని ప్రకటించింది. దీంతో వేలమంది పేదలు డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో చెదలు పట్టిపోతున్నాయి. కొన్ని చోట్ల అర్హులైన వారికి అప్పగించేందుకు సర్వేను కూడా నిర్వహించింది అధికార యంత్రాంగం.
6 నియోజకవర్గాల పరిధిలో 10,406 ఇండ్లకు అనుమతి
నిజామాబాద్ జిల్లాలో మొత్తం ప్రభుత్వం ద్వారా 11,956 డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి మంజూరయ్యాయి. అందులో 10,406 ఇళ్ళ నిర్మాణానికి అనుమతి లభించింది. 8,273 ఇండ్ల టెండర్లు పూర్తయ్యాయి. 4,086 ఇండ్లకు పనులు పూర్తి కాలేవు. 3,010 ఇండ్ల పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జిల్లా మొత్తం 1,177 పూర్తయ్యాయి. జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు అయిన ఖర్చు 116.28 కోట్లు. అందులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 3,402 ఇండ్ల నిర్మాణం జరుగుతుండగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 7,004 ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది.
మంత్రి నియోజకవర్గంలో ఒక్క ఇళ్ళు కూడా పూర్తి కాలే
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 1,177 ఇండ్లు పూర్తి కాగా అందులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పాత వర్ని, కోటగిరి రెండు మండలాల్లోనే 731 ఇళ్ళు పూర్తయ్యాయి. బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి లబ్దిదారులకు అందజేయలేదు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీబీపూర్ తాండ వద్ద 50 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
324 ఇండ్లను స్వాధీనం చేసుకోండి మహాప్రభో
డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం పూర్తికాక లబ్దిదారులకు అందజేయలేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంటే, నిజామాబాద్ అర్బన్ లో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉంది. ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ళను పూర్తి చేసి రెండు సంవత్సరాలు గడిచినా, లబ్దిదారులకు అందజేయకపోవడంతో వాటిని కట్టిన నిర్మాణ సంస్థ దాని మెయింటెనెన్స్( రక్షణ) కల్పించలేక నెత్తినోరు బాదుకుంటున్నారు. స్వాధీనం చేసుకొమ్మని కాంట్రాక్టర్లు వేడుకుంటున్నారు. అర్బన్ లో 2,330 డబుల్ బెడ్ రూంలు మంజూరయ్యాయి. అన్నింటికి టెండర్లు పూర్తి కాగా ఇప్పటి వరకు 1,610 ఇండ్లకు నిర్మాణం ఇంకా ప్రారంభించనే లేదు. నాగారాం భారతిరాణి నగర్ కాలనీలో 396 ఇండ్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ వద్ద 396, అసద్ బాబానగర్ వద్ద మరో 200 ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. నాగారంలో ఇండ్లు పూర్తయిన వాటిని లబ్దిదారులకు అందించాలంటే పురపాలక శాఖ మంత్రి పర్యటన కొరకు ఎదురు చూస్తున్నారు. దాదాపుగా రెండేళ్ళుగా ఈ ప్రక్రియ జరుగుతున్నది. సుమారు 30 వేల మంది డబుల్ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకోగా వాటి వడపోత, సర్వేను పూర్తి చేసినా వాటిని లబ్దిదారులకు అందజేయలేని పరిస్థితి నెలకొంది.
డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిస్థితి
నియోజకవర్గం మంజూరైనవి టెండరైనవి మొదలుకానివి పనులు జరుగుతున్నవి పూర్తయినవి ఖర్చు కోట్లలో
బోధన్ 1712 1332 458 874 0 రూ.15.99 కోట్లు
బాన్సువాడ 1640 1640 17 892 731 రూ.58.89 కోట్లు
రూరల్ 1536 650 336 264 50 రూ.4.64 కోట్లు
అర్బన్ 2330 2330 1610 324 396 రూ.28.19 కోట్లు
ఆర్మూర్ 1532 865 685 180 0 రూ.0.63
బాల్కొండ 1656 1456 980 476 0 రూ.8.34