సడలింపులా.. సంస్కరణలా.. కేసీఆర్ నిర్ణయమేంటి..?
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతటి వరుస వైఫల్యాలకు ఎవరు బాధ్యులు.. ఎందుకిలా జరిగింది.. తక్షణంగా చేపట్టాల్సిన చర్యలేమిటి.? ఇప్పుడు అధికార, ప్రభుత్వ వర్గాల్లో ఉన్న ప్రధాన చర్చ ఇదే. అటు సీఎం కేసీఆర్ కూడా ఇప్పటిదాకా వెయిట్ అండ్ సీ అనే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సీఎస్ అంశంలో తప్పు చేశామా అంటూ ఆల్రెడీ రాజకీయ, వ్యక్తిగత, అధికారిక సలహాదారుల సీఎంకు చెప్పకనే చెప్పుతున్నారు. నొక్కి చెప్పకుండా సీఎస్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై లోపాయికారికంగా సీఎంకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతటి వరుస వైఫల్యాలకు ఎవరు బాధ్యులు.. ఎందుకిలా జరిగింది.. తక్షణంగా చేపట్టాల్సిన చర్యలేమిటి.? ఇప్పుడు అధికార, ప్రభుత్వ వర్గాల్లో ఉన్న ప్రధాన చర్చ ఇదే. అటు సీఎం కేసీఆర్ కూడా ఇప్పటిదాకా వెయిట్ అండ్ సీ అనే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సీఎస్ అంశంలో తప్పు చేశామా అంటూ ఆల్రెడీ రాజకీయ, వ్యక్తిగత, అధికారిక సలహాదారుల సీఎంకు చెప్పకనే చెప్పుతున్నారు. నొక్కి చెప్పకుండా సీఎస్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై లోపాయికారికంగా సీఎంకు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వం వరుస వైఫల్యాలను మూటగట్టుకుంటోంది. ప్రధానంగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి ఫెయిల్ అయినట్టుగా రూఢీ అయింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా దెబ్బ కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వ్యతిరేకతను అంచనా వేసుకుంటున్నారు. ఇటు ధరణితో కూడా మధ్యతరగతి వర్గాలు, రియల్ రంగంపై ఆధారపడిన వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఈ లెక్కన ఎన్ని ధరఖాస్తులు, ఎంత మేరకు వ్యతిరేకత శాతం ఉందనే అంశాలను సలహాదారులు సీఎంకు వివరిస్తూనే ఉన్నారు. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో కూడా దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ఎల్ఆర్ఎస్ ప్రభావం పడింది. దీనికి ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశం అదనం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో పాత విధానానికే వెళ్తోంది. అంటే విఫలమైనట్టు అంగీకరించినట్టే.
ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంశంపై కూడా సీఎంఓ వర్గాలు ఓ నివేదికను కూడా సిద్ధం చేశారు. వారం రోజుల నుంచి ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్… ప్రగతి భవన్‌కు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ నివేదికను సీఎంకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమేననే సంకేతాలున్నాయి. దీంతో ఎల్ఆర్ఎస్పై సీఎం కేసీఆర్ కచ్చితంగా సడలింపులా… సంస్కరణలా అనే కోణంలో నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ల నుంచి సీఎం సలహాలు తీసుకున్నారని భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణమాలు, ఏ విధమైన ప్రచారాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందనే అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయినా వ్యతిరేకతను పెంచుతుండటంతో ఏదైనా కారణాన్ని సాకుగా చూపించి ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకునేందుకే సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పుడు బాధ్యులెవ్వరు..?
ఇప్పుడు అసలు కథ మొదలుకానుంది. మూడు నెలల పాటు సర్కారు ఖజానాపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా సొంత పార్టీలోనే నిరసనలు తీసుకువచ్చిన ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల అంశం ఊహించని పరిణామాలను ముందుంచింది. ఇది కచ్చితంగా సీఎస్ వైఫల్యమే. దీనిలో సందేహాలేమీ లేవు. ఎందుకంటే ఎంతమంది ఎన్ని నివేదికలు, అధికారిక సమాచారాలు ఇచ్చినా ధరణి కోటరీతో సీఎస్ తీసుకున్న నిర్ణయం ఇది. సీఎంకు కూడా ధరణిని కచ్చితంగా చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ సాంకేతిక అంశాలను అధిగమించలేదు. ఇక ఇప్పుడు ఎల్ఆర్ఎస్. ఇది కూడా సీఎస్ స్కీం. ఇది కూడా ఇప్పుడు రివర్స్ కథే. సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకున్న ఈ రెండు చాలా ప్రమాదాలుగా మారాయి. అందుకే వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు దీనికి బాధ్యులెవ్వరు మరి అనే అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రగతిభవన్ వర్గాల్లో చర్చగా మారింది. అయితే సీఎస్‌కు ఇప్పుడు వెంటనే రివర్సన్ ఇస్తే ముందు జరిగే ప్రచారం ఎలా ఉంటుందనేది ఊహించినదే.
దాదాపు 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా… అందరినీ కాదని ఏరికోరి సీఎస్ కుర్చీని ఎక్కించారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… మరీ ముఖ్యంగా ఈ సీఎస్‌కు పగ్గాలు అప్పగించిన తర్వాత వరుస వైఫల్యాలు లిఖించుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సీఎం మదిలో తిరుగుతున్న అంశమే. దీనికి అధికారిక రాజకీయ సలహాదారులు కూడా సీఎస్‌నే బాధ్యులుగా సీఎం ముందుంచుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎస్‌ను కొనసాగిస్తే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీఎంకు సూచిస్తున్నారు.
మరోవైపు సీఎస్‌గా జూనియర్‌కు అప్పగించిన వైనంపై కొంతమంది సీనియర్లు చాలా అసంతృప్తితో రగులుతున్నారు. తమ కంటే జూనియర్‌గా ఉండే అధికారి సీఎస్ స్థానంలో ఉండీ పెత్తనం చెలాయిస్తుండటం, తమ సలహాలను పరిగణలోకి తీసుకోకపోవడం వంటి అంశాలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. కొంతమంది సీఎస్ అంటేనే మాట్లాడవద్దూ అంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో సీఎస్‌కు మద్దతుగా ఉండే సీనియర్ల జాబితా తగ్గుతోంది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆసక్తి. అయితే సీఎస్‌పై వేటు వేస్తారనేది కచ్చితంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సీఎస్ వ్యవహారం అటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఫలితంగా సీఎస్ వ్యవహారంలో నిర్ణయం ఉంటుందనే అనుకుంటున్నారు.
వాట్ నెక్ట్స్..?
అంతేకాకుండా తదుపరి పరిణామాలు ఏమిటి… ? అనే ప్రచారం కూడా అధికారిక వర్గాల్లో జరుగుతోంది. ఓ వైపు సీనియర్లు, తనకు పడని అధికారులపై సీఎస్ కూడా కక్ష సాధింపు చర్యల్లోనే ఉంటున్నారు. దీంతో చాలా మందిలో సీఎస్‌పై ఆగ్రహం రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మార్పులు అనివార్యమైతే మరి నెక్ట్స్ ఏమిటనే కోణంలో కూడా చర్చించుకుంటున్నారు. కొంతమంది సీనియర్లు ఉన్నా వారిపై సీఎం కేసీఆర్‌కు పెద్ద సదాభిప్రాయం కనిపించడం లేదు. సదరు అధికారుల ముక్కుసూటి తనం కూడా వారికి అడ్డు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌ల అంశంలో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ప్రగతిభవన్ నుంచి లీకు అవుతోంది.